Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting: ఉన్న బస్సులన్నీ సభకు తీసుకెళితే ప్రయాణికులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు నరకం చూస్తారని తెలిసి కూడా, నా సభలే నాకు ముఖ్యమనే జగన్ తీరును ఏమనాలని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టి, వారి ప్రయాణాలకు విఘాతం కలిగించి తీసుకెళ్లే బస్సులతో మీ పార్టీ కోసం సొంత డబ్బా కొట్టడం అవసరమా జగన్ అని నిలదీస్తున్నారు. అధికార పార్టీకి రాజకీయ లక్ష్యమే ముఖ్యం అనుకుందాం. మరి ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకాతిరుమలరావు అయినా ఇది సరికాదని ఎందుకు అడ్డుచెప్పడం లేదు?
సీఎం అడిగినన్ని బస్సులు తరలించేసి, అధికార పార్టీకి సాగిలపడాల్సిన పరిస్థితి ఎండీకి ఎందుకొచ్చింది? పేదలు, సామాన్యులు ఎవరైనా పెళ్లికో, ఏదైనా వేడుకకో ఒక్క బస్సు కావాలని అడిగితే అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఎంతసేపు వేచి ఉండాలి తదితరాలన్నీ లెక్కించి, మొత్తం సొమ్మంతా కట్టించుకున్నాకే ఆర్టీసీ అధికారులు బస్సు పంపుతారు. అధికార వైసీపీ విషయంలో మాత్రం ఆర్టీసీ అధికారులకు ఈ నిబంధనలేవీ గుర్తురావడం లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వేలాది బస్సులు పంపేస్తున్నారు.
ప్రయాణికులు నరకం చూస్తున్నా సరే, జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే సభలే మాకు ముఖ్యమంటూ ఆర్టీసీ యాజమాన్యం దాసోహమవుతోంది. ఈ బస్సులకు మొత్తం సొమ్ము ముందే తీసుకుంటున్నారా? అంటే ఏ సభకు పంపిన బస్సులకూ పూర్తిగా సొమ్ము రాబట్టలేదు. మూడు సభలకు పంపిన బస్సులకు వైసీపీ నుంచి ఇంకా 5 కోట్ల బకాయిలున్నాయి. ఇవి వసూలు చేయకుండానే, మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు పంపేందుకు సిద్ధమైపోయారు. వివిధ సామాజికవర్గాల పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో తన సిద్ధం సభకు తీసుకెళ్లిపోతున్నారు.
అన్నొచ్చాడంటే ప్రయాణికులకు కష్టాలే
బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం వైసీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. దీనికి ఎలాగైనా పెద్ద సంఖ్యలో ప్రజలను బలవంతంగా తరలించి, వైసీపీపై ఉన్న అభిమానంతో వచ్చేశారంటూ చూపేందుకు సిద్ధమవుతోంది. జనసమీకరణకు 2,500 బస్సులు కావాలంటూ వైసీపీ పెద్దలు ఆర్టీసీ అధికారులను కోరారు. ఇన్ని బస్సులు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తిరుపతి జిల్లాల నుంచి సర్దుబాటు చేయాలంటే పలు డిపోల పరిధిలో ఉండే 70 నుంచి 80 శాతం బస్సులు అన్నీ సిద్ధం సభకే పంపేయాల్సి ఉంటుంది. అయినా సరే బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వివిధ జిల్లాల నేతలు ఇప్పటికే అధికారులకు ఫోన్లు చేసి ఏయే జిల్లాల్లో, ఏయే నియోజకవర్గాలకు ఎన్ని బస్సులు పంపాలో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. శనివారం ఫస్టియర్ పరీక్ష, సోమవారం సెకండియర్ పరీక్ష ఉన్నాయి. ఈ మధ్యలో ఆదివారం 2 వేల 500 బస్సులు సిద్ధం సభకు తరలించబోతున్నారు. వివిధ జిల్లాల బస్సులను సిద్ధం సభకు ముందు రోజు సాయంత్రానికే పల్నాడు జిల్లాకు రప్పిస్తారు. ఆదివారం రాత్రి సభ ముగిసిన తరువాత ప్రజలను వారి గ్రామాల్లో దించి, మళ్లీ ఆ బస్సులు సొంత డిపోకు చేరేసరికి సోమవారం మధ్యాహ్నం అయిపోతుంది. అంటే శనివారం, సోమవారం సైతం ఇంటర్ ఎగ్జామ్స్ సమయంలో బస్సులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని కొందరు ఆర్టీసీ అధికారులు వైసీపీ పెద్దలకు చెప్పినా సరే, అదేమీ పట్టించుకోకుండా 2 వేల 500 బస్సులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలిసింది.