Huge Income For RTC Through Medaram Fair : తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క - సారలమ్మ(Medaram Sammakka - Saralamma) మహా జాతరకు తరలివచ్చే భక్త జన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మేడారానికి బస్సులు ఏర్పాటు చేశారు. మేడారం మహాజాతర సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు ఈ నెల 18వ తేదీ నుంచి 25వ వరకు ఎనిమిది రోజుల్లో మొత్తం 415 ట్రిప్పుల ద్వారా 13,462 మంది భక్తులను మేడారం జాతరకు తరలించాయి. ఇందులో మహిళా ప్రయాణికులు 6,871 మంది, పురుషులు 6,591 మంది ఆర్టీసీ (RTC) బస్సుల్లో ప్రయాణించారు. జాతర సందర్భంగా భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు రూ.28.46 లక్షల ఆదాయం వచ్చినట్లు డీఎం లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ జీఆర్ రెడ్డి తెలిపారు.
Medaram Fair - Huge Income For RTC : భూపాలపల్లి నుంచి మేడారం జాతర వరకు బస్సుల్లో తరలించిన ప్రయాణికుల వల్ల వచ్చిన ఆదాయం రూ.28.46 లక్షలు కాగా, ఈ మేరకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో భూపాలపల్లికి చేరిన ప్రయాణికుల వల్ల దాదాపు మరో రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు పేర్కొన్నారు. భూపాలపల్లి, కాటారం, కాళేశ్వరం, మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతాల్లో నాలుగు తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి డిపోనకు చెందిన 42 బస్సులు, ఇతర డిపోల నుంచి 42 బస్సులు, మొత్తం 84 బస్సులను జాతరకు ఉపయోగించారు. 307 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది పని చేశారని, జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. నాలుగు తాత్కాలిక బస్టాండ్లలో ప్రయాణికులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.