Huge Drugs Seized In Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయం రోజు రోజుకీ చాపకింద నీరులా సాగుతోంది. కొందరు యువకులు కమీషన్ల కోసం ఈ దారిని ఎంచుకుంటున్నారు. మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్మగ్లర్లుగా మారుతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆయా నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు కేంద్రంగా నిషేధిత ఔషధాల ముడి పదార్ధాల తయారీ కేంద్రం గుట్టును ఔషధ నియంత్రణ శాఖ, ఎక్సైజ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పదేళ్లుగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలోని పీఎస్ఎన్ ఔషధ తయారీ సంస్థ కొనసాగుతోంది. కస్తూరి రెడ్డి అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అయితే గుట్టు చప్పుడు కాకుండా అతను సంస్థలో నిషేధిత మెపిడ్రిన్ ముడి పదార్థాల్ని తయారు చేయిస్తూ పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. గల్ఫ్ దేశాలకు నిషేధిత డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు ఇంటర్‌పోల్ సీబీఐ అధికారులకు లేఖ రాసింది. పోలీసులకు దీనిపై సమాచారం అందించగా ఔషధ నియంత్రణ శాఖకు తెలిపారు. దీంతో ఎక్సైజ్ పోలీసులతో కలిసి ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సంస్థపై దాడులు నిర్వహించారు. అధికారుల సోదాల్లో అనేక కీలకాంశాలు బయటపడ్డాయి. పదేళ్లుగా నిషేధిత ముడి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు.