Huge Crowd on Chandrababu and Pawan Meeting:రాజకీయ చైతన్యానికి మారుపేరైనా కోనసీమ జనజాతరను తలపించింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభకు జనం భారీగా తరలిరావడమే కాకుండా వారితో గొంతు కలిపారు. నేతలిద్దరి ప్రసంగాలకూ స్పందించారు. చంద్రబాబు వేసిన ప్రతి ప్రశ్నకూ స్పందించి సమాధానాలు చెప్పారు. చుట్టూ ఉన్న జనం చేతులెత్తి ఉత్సాహంతో జజ్జనకరి జనారే అంటూ ఊగారు. సభ ముగిసి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వారాహి వాహనం దిగిన తర్వాత అక్కడ వినిపించిన పాటకు వేదిక ముందు యువత నృత్యాలు చేస్తూనే ఉన్నారు.
కోనసీమను వైసీపీ కలహాల సీమగా మార్చే యత్నం చేసింది- పవన్ కల్యాణ్ - Pawan Kalyan at Prajagalam
పి.గన్నవరం నియోజకర్గంలోని అంబాజీపేట, అమలాపురంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సభలు నిర్వహించారు. అంబాజీపేట సభకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకే జనం చేరుకున్నారు. మిద్దెలు, మేడలు, డాబాలు, ఇళ్ల వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్నారు. ఆ వేదిక చుట్టూ ఉన్న భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. మహిళలు విద్యుత్ తీగల సమీపంలోనే నిలుచుని నాయకులను చూసేందుకు ప్రయత్నించడంతో విద్యుత్తును నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోడ్డుకు ఇరువైపులా వారాహి వాహనాన్ని ఆనుకుని ప్రజలు కిక్కిరిసిపోయారు. రెండు సభల్లో చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తూ వాటిపై ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకూ జనం నుంచి మంచి స్పందన రావండతో చాలాసేపు బాబు అలానే కొనసాగించారు. చంద్రబాబు తన ప్రసంగం చివర్లో హలో ఏపీ అంటే సభికులంతా బైబై జగన్ అంటూ పెద్దఎత్తున నినదించారు. పవన్ కల్యాణ్ అభిమానులకు పెట్టింది పేరైన కోనసీమలో వారి ఉత్సాహం మిన్నంటింది.