Huge Changes in YSRCP MLA Candidates List : ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే ఇక ఒకటో అరో ఉంటాయంతే అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన జగన్(CM Jagan) బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. ఐదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు. మొత్తంగా రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులతో 8వ జాబితా(YSRCP MLA Candidates Eighth List)ను బుధవారం విడుదల చేశారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు.
సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మురళికి కూడా అవకాశం కల్పించడంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైసీపీని వీడి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Mangalagiri MLA Alla Ramakrishna Reddy) వద్దకు దూతలను పంపి సంప్రదింపులు జరిపి ఏదో ఒకచోట సీటిస్తామనే భరోసా ఇచ్చి మరీ ఇటీవలే తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఆర్కేని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం ఆయన తిరిగి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది.
వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్
అంబటి రాంబాబు :పైగా సత్తెనపల్లిలో ఆర్కే(RK) సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలు మంత్రి రాంబాబుని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడికి పొన్నూరు సీటివ్వడంతో అంబటి రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా లేదా మారుస్తారా అనే చర్చ మొదలైంది. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు.
ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈనెల 2న నియమించారు. ఆయన ఒకసారి మాత్రమే ఆ నియోజకవర్గానికి వచ్చి తర్వాత దూరంగా ఉన్నారు. దీంతో చేసేది లేక రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను బుధవారం నియమించారు.