Money Saving Tips in Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ డబ్బు సంపాదనపై దృష్టి సారిస్తున్నారు, అందుకు తగ్గట్టూ కష్టపడుతున్నారు. కానీ పొదుపు చేసే విషయంలో మాత్రం కొంతమందే శ్రద్ధ వహిస్తారు. పొదుపు చేసే వారు పిసినారి అని కొందరు అంటుంచారు. ఇది ఎంత మాత్రమూ కాదు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జీవితం సాఫీగా గడుపుతూ సంపాదించిన దాంట్లో కొంత పొదువు చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. సంపాదించింది అలానే ఖర్చు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఎదురయ్యే అతిపెద్ద అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడుతుందని హెచ్చరిస్తున్నారు.
వేతనం పడగానే పొదుపునకు కట్ అవ్వాలి : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా ప్రతినెలా జీతం మొత్తం నుంచి నిర్ణీత కొంత డబ్బును పొదుపు చేయాలి. అది తప్పకుండా అలవాటు చేసుకోవాలి. జీతం రాగానే అది జరిగిపోవాలి. మిగిలిన మొత్తం నుంచే ఖర్చులకు కేటాయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ నెల ఖర్చులకు తక్కువ అవుతున్నాయి, వచ్చే నెల నుంచి పొదుపు చేద్దామనే నిర్లిప్త ధోరణికి అవకాశం ఉండదు. ఇప్పుడు బ్యాంకుల్ల జీతం నుంచి కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, ఆర్డీలకు కేటాయించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. మీ బ్యాంకు ఆన్‌లైన్ ఖాతాల ఈ వివరాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల రిటైర్మెంట్ తర్వాత వారి ఆర్థిక అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదు.
పొదుపు సంఘాల్లో చేరితే ఉత్తమం :పొదుపు చేయడంలో మహిళలది కీలకపాత్ర. నెలవారీ సరుకులు, పిల్లల ఫీజులు, ఇంటి, వాహనాల వాయిదాలు ఇలా అన్నివాటిల్లో పొదుపు చేయడం ఇంటి ఇల్లాలికి కత్తిమీద సామే. కానీ కిరాణం సరుకుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. అనవసరమైనవి తీసుకోరాదు. సూపర్‌మార్కెట్‌కు వెళ్లెముందు ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, లేవు అన్నది చెక్ చేసుకుని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అనవసరమైనవి కొనుగోలు చేసే వీలుండదు. ఉద్యోగినులైతే పండగలు, ప్రత్యేక రోజులకు వచ్చిన అదనపు వేతనాన్ని ఖర్చు పెట్టకుండా కొత్త వస్తువులు కొనుగోలుకో, పిల్లల పేరు మీద తపాలా లేదా బ్యాంకులో జమచేస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. పొదుపు సంఘాల్లో చేరి ప్రతి నెలా కొంత పొదుపు చేయాలి ఇలా అలవాటు చేసుకోవాలి. రుణాలు తీసుకుని సొంత ఖర్చులకు కాకుండా వ్యాపారం చేసేందుకు ఉపయోగించాలి.
అవసరం బట్టి ఖర్చు చేయాలి :విలాసాలు, అనవసర వస్తువులు కొనుగోలు చేయడంలో ఒకటికి రెండుసార్లు అలోచించాక ఖర్చు చేయాలి. ఏదైనా వస్తువు కొనే ముందు అది మనకు ఎంత వరకు ఉపయోగపడుతుంది, దాని అవసరం గురించి ఆలోచించాలి. అది లేకపోతే మనకి పని కాదు అనిపిస్తేనే కొనొచ్చు. అలాగే కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారి సంపాదించిందంతా వాటికే ఖర్చు పెడుతుంటారు. అప్పుడు పొదుపు చేయాలన్న సాధ్యపడదు.
పిల్లలకు ప్రతీది వివరించాలి :డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్న ఈ డైలాగ్ వింటుంటాం. అది నిజమే తల్లిదండ్రులు శారీరక శ్రమను పిల్లలు గుర్తించాలి. డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకుండా, ప్రాధాన్యం తెలుసుకుని పొదుపు చేయడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైతం పిల్లలకు అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఉన్నత విద్యను ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చని అంశాన్ని అందరు గుర్తుకుపెట్టుకోవాలి. పాఠశాలల్లో ‘సంచయిక పొదుపు’ అమలు చేసేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.