తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం అంటే - యూనిట్ ఉత్పత్తి చేసినట్లే - NATIONAL ENERGY CONSERVATION DAY

నేడు జాతీయ ఇంధనం పొదుపు దినోత్సవం - ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు మనం అందరం పాటించాల్సిన కొన్ని నియమాలు

How to Save Energy
How to Save Energy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 1:24 PM IST

Updated : Dec 14, 2024, 1:50 PM IST

National Energy Conservation Day : కరెంట్, పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ వంటివి వెలికి తీయడానికి, దిగుమతి చేసుకోవడానికి ఎంతో భారీ వ్యయం అవుతోంది. కానీ నిత్యావసర జీవితంలో మనిషి ఇవన్నీ లేకుండా మాత్రం ఉండలేడు. రోజురోజుకూ వీటి ధరలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి. వాడకంలో మెలకువలు పాటించక కొరత, ఆర్థిక భారం, కాలుష్యం ఎదుర్కొంటున్నాము. ఒక్క తెలంగాణలోనే వాహనాల సంఖ్య 1.70 కోట్లు. ఏడాదికి సుమారు 11 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పింది.

ఇంజిన్​ను ఆఫ్​ చేయడం మరిచిపోవద్దు : కారు లేదా బస్సు లేదా లారీ లేదా బైక్​ ఇలా వాహనం ఏదైనా ఇంజిన్​ నడుస్తున్నప్పుడు ఇంధనం కాలుతూ ఉంటుంది. అదే ఒక్కసారి ఇంజిన్​ను ఆపితే ఇంధన వినియోగం ఉండదు. అలాగే పొగ తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇంజిన్​ను ఎక్కువసేపు ఆన్​ చేసి ఉంచితే వాహనం జీవిత కాలం కూడా తగ్గుతుంది. అందుకే ఇంజిన్​ను ఆపితే దాని జీవిత కాలాన్ని పెంచవచ్చు. డబ్బూ ఆదా అవుతుంది. మనం ఎక్కువగా ట్రాఫిక్​ సిగ్నల్స్​, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బండి పక్కకు ఆపుతాం. అలాగే సహ ప్రయాణికుల కోసం వేచి ఉన్నప్పుడు చాలా మంది ఇంజిన్​ను ఆన్​లోనే ఉంచి పనులు చేస్తారు.

దీనివల్ల వాహన జీవితకాలం తగ్గడంతో పాటు కోట్లాది లీటర్ల పెట్రోల్​, డీజిల్​ వృథా అవుతుంది. కొన్ని వాహనాలు మైనర్​ రిపేర్లున్నా చేయించరు. ఆపితే ఎక్కడ వాహనం ఆగిపోతుందోనని ఇంజిన్​ను ఆన్​ చేసే ఉంచుతారు. అలాగే టైర్లకు సరిగ్గా గాలి అనేది కొట్టించరు. దీని వల్ల ఇంధనాన్ని వాహనం మరింత తాగేస్తుంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు కోట్లాది మంది చేయటం వల్ల అతి ఎక్కువ జనాభా ఉన్న మనదేశంలో వాటి ప్రభావం ఊహకు అందనంత ఎక్కువగా ఉంటోంది.

ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు వేస్తే కాస్త ఆపండి : ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు, ఫ్రిడ్జ్​లు, టీవీలు, నీటి మోటార్లు, కంప్యూటర్లు, సెల్​ఫోన్​ ఛార్జింగ్​లు ఇంకా అనేక ఎలక్ట్రానిక్​ గృహోపకరణాలు అవసరం లేకపోయినా ప్రతి ఇంట్లో ఆన్​ చేసే ఉంటాయి. ఇలా చేయడం వల్ల అధిక కరెంటు ఖర్చు అవుతుంది. అలాగే సెల్​ఫోన్​ ఛార్జింగ్​ తీసేశాక స్విచ్​ను ఆఫ్​ చేయకపోతే కరెంటు ఖర్చు అవుతూనే ఉంటుంది. షాపింగ్ మాల్స్​, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల విషయానికి వస్తే ఇంధనం విచ్చలవిడిగా వాడేస్తుంటారు. ఇలా అధిక మొత్తంలో కరెంటును వాడితే వాటి ఉత్పత్తికి ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వాలకు అది పెనుభారంగానే మారుతుంది. దీని ఫలితంగా కరెంటు బిల్లులు పెరుగుతాయి. పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతాయి.

నానాటికీ అధికమవుతున్న ఇంధన వినియోగం వల్ల వాయు కాలుష్యం విచ్చలవిడిగా పెరుగుతోంది. దీంతో ప్రజారోగ్యానికి తీవ్ర హాని వాటిల్లుతుంది. అవసరాల దృష్ట్యా ఇంధన వినియోగం తప్పనిసరి. అయితే, దాని వృథా మాత్రం బాధ్యతారాహిత్యం.

కరెంటు వినియోగాన్ని ఈ విధంగా తగ్గించుకోండి :

  • ముఖ్యంగా గృహాలు, వాణిజ్య సముదాయాలలో మామూలు విద్యుత్​ ఉపకరణాలను వాడొద్దు.
  • బీఈఈ (BEE) స్టార్​ రేటింగ్​ కలిగిన ఎల్​ఈడీ లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్​లు, ఏసీలను వాడటం వల్ల కరెంటును ఆదా చేయవచ్చు.
  • అలాగే వేడి నీటి కోసం సోలార్​ వాటర్​ హీటర్లను వినియోగించాలి.
  • అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు బంద్​ చేయాలి.
  • దీని వల్ల బిల్లుల భారం క్రమేణా తగ్గుతుంది.
  • విద్యుత్​ ఉపకరణాలను అంతర్జాలానికి అనుసంధానించి అవసరం మేరకు స్మార్ట్​ఫోన్​తోనే నియంత్రించవచ్చు.
  • ఇళ్లపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్​ను ఉత్పత్తి చేసే కర్బన ఉద్గారాల బెడద తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది.
Last Updated : Dec 14, 2024, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details