తెలంగాణ

telangana

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బీ అలర్ట్‌ - ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని కలవండి - Brain Stroke Symptoms

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2024, 5:01 PM IST

Brain Stroke Symptoms : ఉన్నట్టుండి కంటిచూపు కోల్పోతున్నారా? అదుపు తప్పి పడిపోతున్నారా? అనూహ్యంగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? ఐతే, తస్మాత్ జాగ్రత్త! అది స్ట్రోక్ లక్షణం కావొచ్చు. శరీరంలోని ఓ చేయి బలహీనం అవ్వడం, అడుగు తీసి అడుగు వేసేందుకు కాళ్లు సహకరించకపోవటం లాంటివి స్ట్రోక్‌ లక్షణాలే. అలా అని అదేదో గుండెపోటు కాదు. దాని పేరు బ్రెయిన్ స్ట్రోక్! దీని బారిన ఒక్కసారి పడితే శాశ్వత వైకల్యానికే ఆస్కారం ఎక్కువ. బ్రెయిన్‌ స్ట్రోక్ రావడాన్ని ఎలా గుర్తిచాలి? వైద్యుల సూచనలేంటి? లాంటి అంశాలపై ప్రత్యేక కథనం

How to Recognize a Brain Stroke
Brain Stroke Symptoms (ETV Bharat)

How to Recognize a Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్! భారత్‌లో దీని బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరణాలకు దారి తీస్తున్న కారణాల్లో స్ట్రోక్‌ది నాలుగో స్థానం. ఐనా దీనిపై అవగాహన అంతంత మాత్రమే. గుండె జబ్బులపై ఉన్న అవగాహనలో సగం కూడా బ్రెయిన్ స్ట్రోక్స్‌పై లేదు. వాస్తవానికి గుండెకి రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఇబ్బందొస్తే, అది గుండెపోటుకు దారితీస్తుంది. అలాగే మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడం, లేదా రక్తస్రావం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు.

ఒకప్పుడు వృద్ధులలోనే అధికంగా కనిపించిన బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇప్పుడ యువతలోనూ పెరిగాయి. దశాబ్దకాలంలో యువతలో బ్రెయిన్ స్ట్రోక్స్ 15 % పెరిగాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు వారిలో ప్రమాదం అధికంగా ఉంటుందని తేలింది. పురుషుల కంటే స్త్రీలలో స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్త మరణాలకు గల ప్రధాన కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఐదో స్థానంలో ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

బ్రెయిన్‌స్ట్రోక్ లక్షణాలు :బ్రెయిన్ స్ట్రోక్స్‌ ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. మెదడు రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో వచ్చే స్ట్రోక్ ఇది. 87 % బ్రెయిన్ స్ట్రోక్‌లు రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్. మెదడులో రక్తస్రావం ఐనప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. రెండో రకం స్ట్రోక్‌లు 13 % ఉంటాయి. కాగా గుండెపోటుతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరమైందని వైద్యులు అంటున్నారు.

"బ్రెయిన్ స్ట్రోక్‌ పురుషులలో కంటే మహిళలో ఎక్కువగా వస్తోంది. మహిళలలో హర్మోనల్ మార్పులు, వ్యక్తిగత కారణాలు తదితరల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తోంది. ఇది వచ్చినట్లయితే గోల్డెన్ అవర్‌లో చికిత్స చేసి నివారించవచ్చు". - డా. సుష్మిత, ఎన్.ఆర్.ఐ మెడికల్ కాలేజీ

సాధారణంగా శరీరంలో ఏ అవయవం పని చేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతయారం ఏర్పడితే అది మనిషి మరణానికి దారి తీస్తుంది. లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తుంది. ఒక్కసారి దీని బారినపడితే జీవితం చిన్నాభిన్నం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు త్వరగా గుర్తిస్తే రోగులను కాపాడొచ్చని అంటున్నారు. మాటలో తడబాటు, అకస్మాత్తుగా చూపు కోల్పోవటం, శరీరంలోని ఓ వైపు బలహీనంగా మారటం, విపరీతమైన తలనొప్పి, నిలబడితే తూలి పడిపోవటం వంటివి స్ట్రోక్ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు.

రావడానికి గల కారణాలు : మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రధాన కారణాలు. బీపీ పెరగడంతో మెదడులోని సిరలపై ఒత్తిడి ఎక్కువై రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హైకొలెస్ట్రాల్, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణం అవుతున్నట్టు నిపుణులు గుర్తించారు.

నివారణ ఎలా : చికిత్స బ్రెయిన్ స్ట్రోక్‌ను సమయానికి గుర్తించటం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. గోల్డెన్ అవర్ లోపలే రోగులను ఆసుపత్రికి స్ట్రోక్‌ రెడీ ఆసుపత్రికి తీసుకువెళితే మరణం నుంచి కాపాడటంతో పాటు వైకల్యం రాకుండా కాపాడవచ్చని వివరిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల వరకు ఉండే సమయాన్ని గోల్డెన్ అవర్‌గా చెబుతారు. ఈ సమయంలో రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్లటం ద్వారా స్ట్రోక్ ప్రభావం లేకుండా చూడవచ్చని అంటున్నారు.

స్ట్రోక్‌ని గుర్తించేందుకు B.E.F.A.S.T-బీఫాస్ట్ అంటూ ఓ సూత్రం వివరిస్తున్నారు. ఇందులో B అంట్ బ్యాలెన్స్. బాధితులు ఉన్నట్టుండి తూలిపోతుంటారు. సరిగ్గా నిలబడలేక పోతారు. E అంటే విజన్ లాస్, F అంటే ఫేషియల్ డీవియేషన్ అంటే కంటిచూపు కోల్పోవటం, మూతి భాగం ఓ వైపు లాగినట్టు కావటం, A అంటే ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్ అంటే చేతులూ, కాళ్లు బలహీనం కావటం, S అంటే స్పీచ్ డిస్ట్రబెన్స్, సరిగ్గా మాట్లాడలేకపోవడం. T టైమ్‌ ఆఫ్‌ అసెన్స్‌ అంటే సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లడం.

ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే స్ట్రోక్ రెడీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.బ్రెయిన్ స్ట్రోక్‌కు అనేక రకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. గోల్డెన్ అవర్‌లో రోగిని ఆస్పత్రికి తీసుకవెళ్లగల్గితే గడ్డ కరిగేందుకు ఇంజక్షన్లు ఇవ్వడం సహా అవసరమైన వారికి థ్రాంబెక్టమీ సైతం చేయవచ్చంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్స్‌పై అవగాహన కల్పించి సమయానికి సరైన చికిత్స అందించేందుకు ముందుకొచ్చింది ఇండియన్ స్ట్రోక్ అసోసియేన్. హైదరాబాద్‌లో మొదటిసారిగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో 3 రోజుల పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ విజయా ఆధ్వర్యంలో స్ట్రోక్ సమ్మర్ స్కూల్-2024 కార్యక్రమాన్ని నిర్వహించారు.

"మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రధాన కారణాలు. బీపీ పెరగడంతో మెదడులోని సిరలపై ఒత్తిడి ఎక్కువై రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. దీర్ఘకాల మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హైకొలెస్ట్రాల్, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. - డా. పద్మా శ్రీవాత్సవ, బోర్డ్ మెంబర్, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్

మీలో ఈ 5 లక్షణాలు ఉన్నాయా? - అయితే క్యాన్సర్​ వచ్చే ఛాన్స్ ఉన్నట్టే! - cancer symptoms before diagnosis

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - అది "మంకీపాక్స్" కావొచ్చు! - Monkeypox Symptoms

ABOUT THE AUTHOR

...view details