Tips To Improve Concentration Skills :మీ పిల్లలు ఒక్కచోట కుదురుగా ఉండటం లేదా? చదువుపై ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేకపోతున్నారా? చదువుతున్న విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే దీనికి కారణాలు, ఏవిధంగా ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనే అంశంపై అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పిన విషయాలు మీ కోసం.
ఏకాగ్రతను దెబ్బతీసే ఏడీహెచ్‌డీ (అతిచురుకుదనం) అనే సమస్య పిల్లలకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. వీరు కుదురుగా ఓ చోట ఉండలేరు. దేని మీదా ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేకపోతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న పిల్లల్లో విషయాలను గుర్తుంచుకోవటమూ తక్కువే. కోపం వంటి భావోద్వేగాలనూ అదుపులో ఉంచలేకపోతారు.
ఏకాగ్రతకు పండ్లు, కూరగాయలు చేసే మేలు :ఇలాంటివారికి పండ్లు, కూరగాయలు చాలా మేలు చేస్తున్నట్లుగా అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటితో ఏడీహెచ్‌డీ(అతి చురుకుదనం) లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టుగా కనుగొన్నారు. మెదడులో కొన్ని నాడీ సమాచార వాహకాల మోతాదులు తగ్గటానికీ ఏడీహెచ్‌డీకీ సంబంధం ఉంటున్నట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నాడీ సమాచార వాహకాల తయారీలో, మొత్తంగా మెదడు పనితీరులో విటమిన్లు, ఖనిజాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
కుటుంబ కలహాలవల్ల :ఆకలితో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరికైనా చికాకు కలుగుతుంది. ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న పిల్లలూ దీనికి మినహాయింపు కాదు. తగినంత ఆహారం తీసుకోకపోతే లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలకు తగినంత తిండి ఇవ్వలేని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో తలెత్తే ఒత్తిడి కుటుంబంలో కలహాలకు దారితీస్తోందని, ఇదీ పిల్లల్లో ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు తీవ్రమయ్యేలా చేస్తోందని వివరిస్తున్నారు.