తెలంగాణ

telangana

ETV Bharat / state

మీరు ఫోన్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే - అప్పుడే మీరు సేఫ్! - AWARENESS OF CYBER CRIME

సైబర్‌ మోసగాళ్ల పెట్టుబడి మీరే - డిజిటల్‌ వేదికలు, సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా నేరస్తుల వల - అప్రమత్తత మరిచారో జేబులు ఖాళీ కావటం పక్కా!

Cyber crime Prevention
Awareness of Cyber Crime (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 4:36 PM IST

Updated : Oct 22, 2024, 7:38 PM IST

Awareness of Cyber Crime : జనం అత్యాశ.. భయం.. ఈ రెండే సైబర్‌ మాయగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. భయపడేవాళ్లలో ఎక్కువగా విద్యావంతులు, ఉన్నతవర్గాలవారు ఉండటం గమనార్హం. ఇలాంటివేవీ నమ్మాల్సిన పనిలేదంటున్నారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణా ఏసీపీ ఆర్‌.జి.శివమారుతి. సైబర్​ ఎటాక్​లకు గురికాకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు.

మానసికంగా దెబ్బతీసి :

ఆగంతుకులు ఫోన్‌ చేసి.. ఫలానా అమ్మాయి/ అబ్బాయి మీ పిల్లలేనా అని ప్రశ్నిస్తారు? వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పగలరా అంటూ ఆరాతీస్తారు. పిల్లల పేర్లు, చెప్పి మానసికంగా మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తారు. వాళ్లని కిడ్నాప్‌ చేశామని, ఇప్పుడు వారు మా దగ్గరే ఉన్నారంటూ.. ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తారు. అనంతరం డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు.

పార్శిల్‌ మోసాలు :

ఫెడెక్స్‌ కొరియర్‌ పేరిట ఫోన్‌ చేసి.. ‘మీ ఆధార్, పాన్‌ నంబరుతో బుక్‌ అయిన పార్శిల్‌లో నిషేధిత ఐటెమ్స్​ ఉన్నాయి. ముంబయి/దిల్లీ పోలీసులు, కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో మీరు దోషులుగా ఉన్నారు. అంటూ భయపెడతారు. ఆ తర్వాత స్కైప్‌ వీడియో కాల్‌ చేసి పోలీసు యూనిఫారంలో ఉన్న వ్యక్తి వచ్చి కేసు దర్యాప్తు, విచారణ అంటూ ఉన్నపలంగా హడావుడి చేస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మళ్లీ నిబంధన పెడతారు. చెబితే వారినీ అరెస్ట్ చేస్తామంటూ భయపెడతారు.

Cyber Crime Prevention : గదిలోంచి బయటకు వచ్చినా, ఫోన్‌ కట్‌ చేసినా.. ఇంటి బయటే ఉన్న పోలీసులు వెంటనే మిమ్మల్ని, ఫ్యామిలీ మెంబర్స్​ను అరెస్టు చేస్తారంటూ హెచ్చరిస్తారు. ఎఫ్‌ఐఆర్‌తో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు వారెంట్లు అంటూ డాక్యుమెంట్లు చూపిస్తారు. ఆన్‌లైన్‌లోనే డిజిటల్​ అరెస్టు చేస్తామంటారు. కేసు పోవాలంటే మూడో వంతు డబ్బు ఆర్‌బీఐ అకౌంట్​లో జమ చేయాలని హుకుం జారీ చేస్తారు. 24 గంటల వ్యవధిలోనే ఆ డబ్బు తిరిగి వస్తాయంటారు. ఈ బెదిరింపులకు లొంగిపోతే మన ఖాతాలు ఇక ఖాళీ అయినట్లే.

అంతా సెట్టింగే :

స్కైప్‌ వీడియో కాల్‌లో కనిపించే పోలీసుల వెనుక మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించి సర్కార్​ లోగోలు కనిపిస్తాయి. ఇందంతా సైబర్‌ నేరగాళ్లు ఏర్పాటు చేసుకున్న సెట్టింగ్‌ మాత్రమే. ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే ఫోన్‌ కట్‌ చేసి ఆ సైబరాసురుల నంబర్లను బ్లాక్‌ చేయాలి. టోల్​ ఫ్రీ 1930 నంబరుకు లేదా www.cybercrime.gov.in లో మోసగాళ్ల ఫోన్‌ నంబరులతో ఫిర్యాదు చేస్తే వాటిని వెంటనే బ్లాక్‌ చేస్తారు.

ఆశపెట్టి - అధిక లాభాలు వస్తాయని :

ఆన్‌లైన్‌లో హోటళ్లకు రేటింగ్‌లు, రివ్యూలు రాయడం, పంపించిన వీడియోలకు లైక్‌లు, ట్రేడింగ్‌లో లాభాలు అంటూ ఆశపెట్టి దోచేస్తుంటారు కొందరు. ట్రేడింగ్‌లో ట్రైనింగ్​ ఇస్తామని చెప్పి వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూప్‌లలో సభ్యత్వం చేర్చుకుంటారు. అక్కడ జరిగే చర్చను చూసి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చాలా మంది పెట్టుబడులు పెడతారు. అంతా అయ్యాక మోసపోయామని గ్రహిస్తారు. ప్రధానంగా టెలిగ్రామ్, ఇతర సోషల్​ మీడియా ఫ్లాట్​ఫాంలలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, షేర్‌ మార్కెట్‌లో 200, 300 శాతం లాభాలంటే అంటే మోసమని తెలుసుకోవాలి.

బిల్లులు.. కేవైసీలు.. :

పవర్​ బిల్లు కట్టాలని, అలాగే క్రెడిట్, డెబిట్, బ్యాంక్​ అకౌంట్​లకు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోండి లేదంటే మీ సేవలు నిలిచిపోతాయంటూ మరికొందరు మోసాలకు పాల్పడుతుంటారు. వారు పంపించే ఏపీకే ఫైల్స్‌ (లింక్‌)పై అసలు క్లిక్‌ చేయవద్దు. ఇటీవల జాతీయ బ్యాంకుల లోగోలతో లింక్‌ పంపించి మరీ బురుడీ కొట్టిస్తున్నారు. దానిపై పొరపాటును కూడా క్లిక్‌ చేయవద్దు.

ఇవి గమనించాలి.. :

వాస్తవానికి పోలీసులకు ఫలానా చోట నిందితుడు ఉన్నాడని ఇన్ఫర్​మేషన్​ అందితే ఒకటి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాత మాటు వేసి పట్టుకుంటారు. అంతేగానీ మిమ్మల్ని అరెస్టు చేస్తామని వీడియో కాల్‌ చేసి ఎవరూ చెప్పరు. డిజిటల్‌ అరెస్టు అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు.

కస్టమర్ కేర్ నంబర్​ కోసం గూగుల్​లో సెర్చ్ చేస్తున్నారా? - ఐతే మీ ఖాతా ఖల్లాస్

జీ-మెయిల్ యూజర్లకు అలెర్ట్- మీకు ఆ రిక్వెస్ట్‌ వచ్చిందా?- అయితే బీ కేర్​ ఫుల్..!​

Last Updated : Oct 22, 2024, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details