Households Spending More On Beverages Food :పానీయాలు, చిరుతిళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్ (శుద్ధి చేసిన ఆహారం) కోసమే దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రజలు వీటిపై 9.84%, పట్టణవాసులు 11.09 శాతం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర గణాంకశాఖ తాజాగా విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయం 2023-24’ నివేదిక తెలిపింది.
గ్రామీణుల ఖర్చులో పండ్లు 6వ స్థానంలో ఉండగా, పట్టణ వాసుల జాబితాలో అది 4వ స్థానంలో ఉంది. ఇది తప్ప మిగిలిన అన్నింటిలోనూ గ్రామీణ, పట్టణ వాసుల ప్రాధాన్యం ఒకేలా ఉంది. ఆహారం, ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సగటున రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996 ఖర్చు చేస్తున్నారు. ఇందులో సిక్కిం వాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యయంతో తొలి స్థానంలో ఉండగా, ఛత్తీస్‌గఢ్ వాసులు చివరి స్థానంలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా :ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వాసుల కంటే పట్టణ వాసుల నెలవారీ వ్యయం 34 శాతం అధికంగా ఉంది. తెలంగాణలో ఇది 65 శాతం వరకు ఉంది. జాతీయస్థాయిలో ఈ తేడా 69.72 శాతం మేర నమోదైంది. దీని మధ్య తేడా 2011-12లో 83.9 శాతం వరకు ఉండగా, 2022-23నాటికి 71.2శాతానికి తగ్గింది. ఇప్పుడు మరింత తగ్గి 69.7 శాతం మేర నమోదైంది. గ్రామీణ ఖర్చు, పట్టణ ఖర్చులో తెలంగాణ వరుసగా 11, 5 స్థానాల్లో; ఆంధ్రప్రదేశ్ 13, 18 స్థానాల్లో ఉన్నాయి. ఆహార వస్తువుల ఖర్చుల విషయంలో ఉప్పు, చక్కెర చివరి స్థానంలో ఉన్నాయి.
ఆహారేతర అవసరాల ఖర్చులు :ఆహారేతర అవసరాలకోసం చేసే ఖర్చుల్ని చూస్తే రవాణా కోసం గ్రామీణ, పట్టణవాసులిద్దరూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యానికి గ్రామీణ ప్రజలు రెండో ప్రాధాన్యం ఇస్తుండగా, పట్టణవాసులు రెండో ప్రాధాన్యం వినోదానికి కేటాయిస్తున్నారు. డ్రెస్సులకు, పాదరక్షలు, బెడ్డింగ్‌కు గ్రామీణులు మూడో ప్రాధాన్యం ఇవ్వగా, పట్టణవాసుల జీవితంలో ఆ స్థానాన్ని ఎలక్ట్రానిక్, విద్యుత్తు ఉపకరణాలు ఆక్రమించాయి. అద్దె ఖర్చు విషయంలో గ్రామీణవాసులు 10వ స్థానంలో ఉండగా, పట్టణవాసుల ఖర్చులో మాత్రం అది 4వ స్థానంలో ఉంది. గ్రామీణ వ్యయంలో విద్య 9వ స్థానంలో ఉండగా, పట్టణవాసుల జీవితంలో అది 5వ స్థానంలో ఉంది.