Home Voting in Telangana Lok Sabha Elections 2024 :ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి రాలేని వయోవృద్ధులు, దివ్యాంగులు ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు. వారిని దృష్టిలో ఉంచుకున్న ఎన్నికల సంఘం, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి హోం ఓటింగ్‌కు శ్రీకారం చుట్టింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారి ఇంటి నుంచే ఓటేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు. 85 ఏళ్ల వయసు దాటిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి హోమ్ ఓటింగ్‌ను వినియోగించుకోనున్నారు.
ఇటీవల ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,956 మంది 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారు. నల్గొండ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకర్గాల్లో 9,592 మంది, భువనగిరి నియోజకవర్గ పరిధిలో 1364 మంది వృద్ధ ఓటర్లున్నారు. ఇంటి వద్ద నుంచే ఓటే వేయించేందుకు నియోజకవర్గానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు, వీడియోగ్రాఫర్, మైక్రో అబ్జర్వర్, పోలీస్ సిబ్బంది ఉంటారు. హోమ్ ఓటింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తారు.
మహబూబ్‌నగర్ , నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ హోమ్ ఓటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి ఆరో తేదీ వరకు అధికారుల బృందం ఓటర్ల ఇంటికి వెళ్లనున్నారు. అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేని వారి కోసం 8వ తేదీ లోపు మరోసారి ఓటేసే అవకాశం కల్పించనున్నారు. ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించి వారి పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలు బీఎల్‌ఓలకి అప్పగించారు. మరోవైపు ఓటరు స్లిప్పుల పంపిణీ సైతం జోరుగా సాగుతోంది. స్లిప్పులతోపాటు ఓటరుకు అవసరమైన సమాచారంతో కూడిన ఓటర్ గైడ్‌ను సైతం అందిస్తున్నారు.