హెచ్ఎండీఏ కార్యాలయాలన్నీ ఒకే చోటకు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం HMDA Offices Shift To Paigah Palace : హైదరాబాద్‌లోని మూడు వేర్వేరు చోట్ల నుంచి పనిచేస్తున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కార్యాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వాటన్నింటిని ఒకే చోటకు తరలించాలని హెచ్ఎండీఏ ఎండీ దానకిషోర్‌ను ఆదేశించారు. దీంతో హెచ్ఎండీఏను బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు తరలిస్తున్నట్లు దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Govt on HMDA :హెచ్‌ఎండీఏ (HMDA) ప్రస్తుత ప్రధాన కార్యాలయం అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో ఉండగా ట్యాంక్‌బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, నానక్‌రాంగూడలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, అర్బన్ ఫారెస్ట్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇక నుంచి ఆ మూడు కూడా పైగా ప్యాలెస్‌కు మారనున్నాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు, తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీఎస్ఆర్టీసీ సహా ఇతర సంస్థల అభివృద్ధి కార్యకలాపాలను హెచ్‌ఎండీఏ సమన్వయం చేస్తుంది.
సర్కారీ లే అవుట్లు - ఔటర్ చుట్టూ 924.28 ఎకరాల్లో అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు!
ఈ క్రమంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, పర్యవేక్షణ లేకపోవడం, ముఖ్య సమావేశాల సందర్భంలో కాలయాపన, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం ఇలా రకరకాల కారణాలతో హెచ్ఎండీఏ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది గమనించిన ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థను పూర్తిగా పైగా ప్యాలెస్‌లోకి మార్చాలని నిర్ణయించింది.
15 ఏళ్ల కిందట పైగా ప్యాలెస్‌లోనే కార్యాలయం :15 ఏళ్ల కిందట హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ కార్యాలయం పైగా ప్యాలెస్‌లోనే కొనసాగింది. ఆ తర్వాత తార్నాకలోని హుడా కాంప్లెక్స్‌కు తరలించారు. అనంతరం అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌కు మార్చారు. తాజాగా ప్రభుత్వం పైగా ప్యాలెస్‌కే తిరిగి హెచ్ఎండీఏను తరలిస్తుండటం గమనార్హం. బేగంపటే చిరాన్‌లేన్‌లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పైగా ప్యాలెస్ అద్భుతమైన చారిత్రక కట్టడం.
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900 సంవత్సరంలో పైగా ప్యాలెస్‌ను నిర్మించారు. అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలిలో నిర్మాణం చేపట్టారు. మూడు అంతస్తుల్లో ఉన్న భవనం హెచ్ఎండీఏలోని అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా సమన్వయం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వందేళ్లు గడిచినా చెక్కు చెదరని కళాత్మకతతో ఉట్టిపడే ఈ ప్యాలెస్‌ను ఇటీవల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ అనుకూలంగా ఉండదని భావించి ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత హెచ్ఎండీఏకు అనువుగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అన్ని కార్యాలయాలను ఇక్కడికి తరలించాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Paigah Palace in Hyderabad : ఆగస్టులోగా కార్యాలయాలను పైగా ప్యాలెస్‌కు తరలించాలని ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. కార్యాలయాల తరలింపుతో ఖాళీ అయ్యే అమీర్‌పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లోని ఐదు అంతస్తులు లీజుకివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. బుద్ధపూర్ణమ భవన్‌తోపాటు నానక్‌రాంగూడలోని కార్యాలయాన్ని సమీపంలో ఉన్న శాఖలకు అప్పగించాలని భావిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్-2050
లీజుల దందా - అద్దెల చెల్లింపులో హెచ్ఎండీఏకు మొండిచెయ్యి