HMDA Notification on FTL Water Ponds :హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులకు సంబంధించి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్) లెక్కలు తేలనున్నాయి. దీంతో ఎఫ్‌టీఎల్ ఆక్రమణదారుల గుట్టురట్టు కానుంది. ప్రస్తుతం హెచ్ఎండీఏలోని 7 జిల్లాల పరిధిలో 3,874 చెరువులను గుర్తించగా ఇప్పటికే 962 చెరువులకు ఎఫ్‌టీఎల్ తుది నోటిఫికేషన్ జారీ చేశారు. మరో 2,912 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 12 సంవత్సరాల క్రితమే ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నత్తను తలపిస్తోంది. ఎట్టకేలకు హైకోర్టు జోక్యంతో యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఎప్పటికప్పుడు చెరువుల సమాచారాన్ని కోర్టుకు సమర్పించాల్సి రావడంతో అధికారులు తర్వతిగతిన ఈ తతంగం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
- 2 దశబ్దాల వరదను పరిగణలోకి తీసుకొని స్థానిక గ్రామ, రెవెన్యూ మ్యాపులను పరిశీలించి, పకడ్బందీగా ఎఫ్‌టీఎల్ నిర్ధారించిన తర్వాత ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫై చేస్తారు. తర్వాత దాన్ని మార్చేందుకు వీలు ఉండదు.
- అవుటర్ రింగ్‌రోడ్డు లోపల చెరువులను హైడ్రా కిందకు చేర్చుతూ ప్రభుత్వం జీవో 129 జారి చేసిన విషయం తెలిసిందే. ఈ చెరువుల వరకు లేక్ ప్రొటెక్షన్ అంతా హైడ్రా హ్యాండిల్ చేయనుంది. ఎఫ్‌టీఎల్ వరకు హెచ్ఎండీఏ నిర్ధారించినప్పటికీ వాటి పరిరక్షణ మాత్రం హైడ్రా చూడనుంది.
- ఈ ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలు, లేఅవుట్లకు తొలుత హైడ్రా నుంచి క్లియరెన్సు వచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ అనుమతులు ఇస్తుంది. నగరం చుట్టూ ఉన్న చెరువులకు భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఈ చర్యలు ఉపయోగపడునున్నాయి.
- ఒకవేళ ఆక్రమణలు జరిగినా ఎఫ్టీఎల్లో నిర్మాణాలున్నా హైడ్రా విచారించి చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంటజలాశయాలు సైతం ఈ జాబితాలోనే ఉన్నాయి.
- ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించిన తర్వాత అప్పటికే ఉన్న ఆక్రమణలను కూల్చివేయాలి. అ స్థలంలో ఎలాంటి కట్టడాలను అనుమతులు ఇవ్వరు. చెరువులు, పచ్చదనం రక్షణ కోసం హెచ్ఎండీఏ ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది.