ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేనల్లుడి కోసం అత్యున్నతాధికారి నిర్వాకం - రూల్స్​ మార్చి పదోన్నతులు - Dravidian University - DRAVIDIAN UNIVERSITY

Higher Officer Change Dravidian University Rules for Nephew: చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో నిబంధనలను మేనల్లుడి కోసం అత్యున్నతాధికారి మార్చేశారు. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు తన అధికారాన్ని వినియోగించారు. అతడి ఒక్కరికే ప్రయోజనం కల్పిస్తే ఇబ్బందులు వస్తాయని ఆ విభాగంలో పని చేస్తున్న 11 మందిని మార్చారు.

Higher Authority Change University Rules in Nephew
Higher Authority Change University Rules in Nephew

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 7:52 AM IST

మేనల్లుడి కోసం అత్యున్నతాధికారి నిర్వాకం - రూల్స్​ మార్చి పదోన్నతులు

Higher Officer Change Dravidian University Rules for Nephew :వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చి సీఎం జగన్‌ భ్రష్టు పట్టిస్తే ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాల రాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి, బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్చారు. దీనికి ఉన్నత విద్యా మండలిలోని ఓ కీలక వ్యక్తి సహకారం అందించారు.

ప్రభుత్వంలోని అత్యున్నతాధికారి చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు పాతరేశారు. బినామీ పేర్లతో విశాఖలో భారీగా ఎసైన్డ్‌ భూములను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అత్యున్నతాధికారి నిబంధనలు మార్చి తన మేనల్లుడికి నజరానా ఇచ్చారు. ద్రవిడ సాహిత్యం కోసం వర్సిటీలో ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ అత్యున్నతాధికారి మేనల్లుడితో సహా 11మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. ఆయన మేనల్లుడు సహాయ డైరెక్టర్‌ హోదాలో ఉన్నారు. వాస్తవంగా వీరు ద్రవిడ భాష పుస్తకాల ముద్రణ చేపట్టాలి. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఆయా బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు అత్యున్నతాధికారి తన అధికారాన్ని వినియోగించారు. డైరెక్టర్‌ పోస్టును ప్రొఫెసర్‌గా, డిప్యూటీ డైరెక్టర్‌ను అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఎడిటోరియల్‌ సహాయకులు, సహాయ డైరెక్టర్లు, సహాయ ఎడిటర్‌ పోస్టులను సహాయ ఆచార్యులుగా మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చేసింది.

అధికారం తండ్రిది పెత్తనం తనయుడిది - రౌడీగ్యాంగ్‌తో ప్రజాప్రతినిధి కుమారుడి అరాచకం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​గా ఉన్నప్పుడు 1999లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సహాయ ఆచార్యుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటన ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చకూడదని ఉమ్మడి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలికి 2007 మార్చి 23న ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండింటికీ విరుద్ధంగా ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధన విభాగంలోకి మార్చారు. దీన్ని ఆడిట్‌ విభాగం మొదట తప్పు పట్టింది. ఆర్థికశాఖ అనుమతిచ్చాక ఆడిట్‌ విభాగానికి ఏంటంటూ అత్యున్నతాధికారి ప్రశ్నించడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి.

విచ్చలవిడిగా వైసీపీ నేతల భూఆక్రమణలు - కన్ను పడితే చాలు స్థలం కబ్జానే ?

వర్సిటీలోని బోధనేతర పోస్టుల్ని బోధన పోస్టులుగా మార్చేందుకు మొదట ఉన్నత విద్యామండలి తరఫున కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సత్యనారాయణ, శ్రీకాంత్‌రెడ్డి, బాబివర్దన్‌ సభ్యులుగా ఉన్నత విద్యామండలికి చెందిన శ్రీరంగం కన్వీనర్‌గా ఉన్నారు. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్‌ రెడ్డి వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ అయ్యారు. కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక అధికారి చక్రం తిప్పారు. విద్యార్హతలు ఉన్నందున బోధనేతర విభాగంలో పని చేస్తున్నప్పటికీ వీరు తరగతులు చెబుతున్నట్లుగా నివేదికలో తెలిపారు. పాఠాలు బోధిస్తున్నందున వీరిని ఆచార్యులుగా మార్చవచ్చని కమిటీ సిఫార్సు చేసింది. ఆ నివేదికను వర్సిటీ పాలకవర్గంలో పెట్టి ఆమోదించడం జరిగింది. అనంతరం దాన్ని ప్రభుత్వానికి పంపి బోధన పోస్టులుగా మార్చేశారు.

అత్యున్నతాధికారి మేనల్లుడు ఒక్కరికే ప్రయోజనం కల్పిస్తే ఇబ్బందులు వస్తాయని ఆ విభాగంలో పని చేస్తున్న 11 మందిని మార్చారు. ప్రస్తుతం వీరు తమకు పదోన్నతులు కల్పించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ప్రచురణ విభాగంలో నియమించేందుకే ముగ్గురికి అర్హత లేదని, విద్యార్హతలు లేకుండా వారిని తీసుకున్నారని గతంలో ఇద్దరు విశ్రాంత వీసీలతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదించింది. దాని ప్రకారం వారిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉండగా, ఇప్పుడు ఏకంగా బోధన పోస్టుల్లోకి తీసుకున్నారు.

పార్టీ మారిన కాంట్రాక్టర్​ - బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే పీఏ వేధింపులు

ABOUT THE AUTHOR

...view details