High Court Removed Suspension Of OSD Harikrishna : హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక వేదింపుల ఆరోపణలపై సస్పెండ్ అయిన మాజీ ఓఎస్‌డీ డా.హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. డా.హరికృష్ణను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఆయన తరఫు న్యాయవాది హైకోర్టులో(Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు, సిబ్బంది నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన సస్పెండ్ చేయడం తగదని, ఇది నిబంధనలకు విరుద్ధమని హరికృష్ణ తరఫు న్యాయవాది పురుషోత్తం రెడ్డి వాదించారు. దీనికి సంబంధించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
"విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా సరే విధుల నుంచి మాజీ ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఆ చర్యపై సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే, సస్పెండ్ ఉత్తర్వులను కొట్టివేశారు. దీనికి సంబంధించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా, సస్పెండ్ అంశాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించి ఈ తీర్పును వెలువడించింది."-పురుషోత్తం రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది
Hakimpet Sports School Case Update :లైంగిక వేదింపుల(Sexual Harassment) ఆరోపణలపై కమిటీ వేసినా, ఎలాంటి ఆధారాలు బయటపడలేదని ఆయన కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు, సస్పెండ్ ఉత్తర్వులను కొట్టేసింది. స్వార్థప్రయోజనాల కోసం తనను సస్పెండ్ చేసి మానసిక క్షోభకు గురి చేశారని మాజీ ఓఎస్‌డి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వాళ్లపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు.
"నాకు జరిగిన అన్యాయానికి వేరే రకంగా అయితే ఎక్కడకో వెళ్లి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. అంతగా మానసిక ఒత్తిడిని అనుభవించాను. అట్లాంటి పరిస్థితిలో నేను కోర్టుకు రావటం, మా అడ్వకేట్ సాయంతో నేను ఇవాళ నిలబడి ఉన్నాను. నేను చేసింది న్యాయమా, అన్యాయమా అని విచారణ జరపడానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ తరువాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇవేమీ చేయకుండా కొందరు అత్యుత్సాహంతో నన్ను బలిచేయటం ఏమిటి? అన్యాయం" -డా.హరికృష్ణ, మాజీ ఓఎస్డీ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్