Telangana High Court On Indiramma Athmiya Bharosa :తెలంగాణ హైకోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. పురపాలికాల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన ప్రభుత్వం, పురపాలికల్లో ఉంటున్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. 129 పురపాలికల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలున్నారని చెప్పారు.
పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, గ్రామాల్లో వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ, నాలుగు వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలోకి తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.