High Court on EX MLA Shakeel Case :హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద కారుతో బారికేడ్‌లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మరో ఇద్దరిపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను(ఎల్‌ఓసీ) నిలిపివేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పిటిషనర్లు ఈనెల 23లోగా పోలీసుల ముందు విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గత డిసెంబరులో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్ కుమారుడు సాహిల్‌తోపాటు స్నేహితులపై కేసు నమోదు నమోదు చేశారు. దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుక్‌అవుట్ సర్క్యులర్లను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్(EX MLA Shakeel), మహమ్మద్ ఖలీల్, సయ్యద్ సాహెద్ రహమాన్ హైకోర్టులో శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.
High Court Disimissed Lookout Circular Shakeel : దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడంలేదని, అదే సామాన్యులైతే ఇలానే చేస్తారా అంటూ న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీచేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అనంతరం దీనిపై వాదనలను విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్‌ఓసీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని, పిటిషనర్లను అరెస్ట్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ కేసు నేపథ్యం :గత సంవత్సరండిసెంబర్ 23 రాత్రి మూడు గంటల సమయంలో అతివేగంగా దూసుకెళ్లిన ఓ కారు ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్, బారీకేడ్లను ఢీ కొట్టింది. ఆ రోజు రాత్రి విధుల్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తి, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణించారని ధ్రువీకరించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సాహిల్‌ను పోలీసులు తీసుకెళ్లారు.