ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే: కేంద్రం - ఏపీలో అక్రమ ఇసుక రవాణా

High Court on Illegal Sand Mining in AP: రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వాస్తవమేనని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అధికారుల బృందం భారీగా అక్రమ తవ్వకాలను ఆధారాలతో నిర్ధారించిందని స్పష్టం చేసింది. త్వరలోనే నివేదికను ఎన్జీటీకి సమర్పిస్తామని చెప్పింది. ఇసుక విధానం వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించిన న్యాయస్థానం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ జరగకుండా చూడాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

High_Court_on_Illegal_Sand_Mining_in_AP
High_Court_on_Illegal_Sand_Mining_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 8:15 AM IST

Updated : Feb 15, 2024, 12:22 PM IST

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే: కేంద్రం

High Court on Illegal Sand Mining in AP :రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిత్వ శాఖ-ఎంఓఈఎఫ్‌ హైకోర్టుకు తెలిపింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు-సీపీసీబీ, ఎంఓఈఎఫ్‌ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించారని భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్నట్లు తేల్చారని వెల్లడించింది. అక్రమ తవ్వకాల ఫోటోలు, నకిలీ బిల్లు పుస్తకాలు వంటి ఆధారాలను కమిటీ సేకరించిందని ఎంఓఈఎఫ్‌ తరఫు న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ హైకోర్టుకు తెలిపారు.

జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్ వర్క్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్లు కమిటీ నిర్ధారించిందని కోర్టుకు చెప్పారు. పూర్తి వివరాలతో నివేదికను ఎన్జీటీకి అందిస్తామని ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచుతామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఇసుక విధానం ఏమిటి? ధరను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎలా రవాణా చేస్తున్నారు? తదితర వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

రీచ్‌లలో కలెక్టర్ల తనిఖీల హడావుడి - నిలువెత్తు ఇసుకలో 'నిజాలకు పాతర'!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మైనింగ్‌ జరగకుండా చూడాలని కలెక్టర్లు, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. కోర్టుకు చెప్పిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలుచేయాలని, ఎన్జీటీలో దాఖలుచేసే నివేదికను తమ ముందు ఉంచాలని ఎంఓఈఎఫ్‌ తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం సమీపంలోని కృష్ణా నదిలో జేపీ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతోందని, నదికి అడ్డంగా ర్యాంపులు ఏర్పాటుచేసి ఇసుకను భారీ వాహనాలతో తరలిస్తున్నారని పేర్కొంటూ జీవీఎస్‌ఎస్‌ వరప్రసాద్, మరో ఐదుగురు గతేడాది ఏప్రిల్‌లో పిల్‌ దాఖలు చేశారు.

బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది జంపని శ్రీదేవి వాదనలు వినిపించారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకునేలా ర్యాంప్‌లను నిర్మించారని అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో కృష్ణా నదిలో ఇసుకను విచక్షణారహితంగా తవ్వేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సొమ్ము చెల్లింపులన్నీ నగదు రూపంలో జరుగుతాయని గనుల అక్రమ తవ్వకాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉంటుందన్నారు. ఇసుక రీచ్‌లన్నీ అధికారపార్టీ నేతల చేతుల్లో ఉంటున్నాయని తెలిపారు.

కోర్టుకు సహాయకులుగా నియమితులైన అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఇసుక తవ్వకాల్లో గుత్తాధిపత్యం ఉంటుందన్నారు. ఇబ్రహీంపట్నంలో లారీ ఇసుక 35వేల రూపాయలు పలుకుతోందన్నారు.

రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ నేతలు - ఈనాడు విలేకరిపై దాడి

కేంద్రం తరఫున యజ్ఞదత్‌ వాదనలు వినిపిస్తూ పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర స్థాయి పర్యావరణ అంచనా సంస్థ రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో తవ్వకాల అనుమతులను రద్దుచేసిందన్నారు. సీపీసీబీ, ఎంఓఈఎఫ్‌ అధికారులు పరిశీలిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయ్యిందని వివరించారు.

రాష్ట్ర గనులశాఖ తరఫున జీపీ నవీన్‌ వాదనలు వినిపిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలేవీ జరగట్లేదని అన్నారు. మేం అనుమతులు ఇవ్వలేదని గతంలో తవ్వి రీచ్‌లలో నిల్వ ఉంచిన ఇసుకనే రవాణా చేస్తున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్టాక్‌పాయింట్ల వద్ద ఎప్పటికీ తరగనంత ఇసుక నిల్వ చేశారా? అని నిలదీసింది. ఎంతకాలం ఇలాంటి మాటలు చెబుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారుల దృష్టికి తెచ్చినా చర్యలు లేవంటూ చిత్తూరు మండలం, అనంతపురం సర్పంచ్‌ డి.స్వామినాథన్‌ దాఖలు చేసిన పిల్‌పైనా హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. నీవా నదిలో భారీ యంత్రాలతో విచక్షణారహితంగా ఇసుకను తవ్వుతున్నారని చెప్పి ఫోటోలను ధర్మాసనం పరిశీలనకు ఇచ్చారు. రాష్ట్రంలో అక్రమ తవ్వకాలపై వరుసగా వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తవ్వకాలను నిలువరించడంలో విఫలమైతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించింది.

చిత్తూరు జిల్లా అనంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీవా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపేయాలని గనులు, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని మీ దృష్టికి వచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అక్కడి పరిస్థితులపై స్థాయీ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. జయప్రకాష్‌ పవర్‌ వెంచర్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థలకు నోటీసులు జారీచేసింది. కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మార్చి 13కి వాయిదా వేసింది.

యథేచ్చగా అధికారపార్టీ నాయకుల ఇసుక అక్రమ రవాణాలు - లారీలను అడ్డుకున్న గ్రామస్థులు

Last Updated : Feb 15, 2024, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details