తెలంగాణ

telangana

ETV Bharat / state

'గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందే - విధుల్లో విఫలమైతే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం' - HC SERIOUS ON GHMC OFFICIALS

గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందే - జీహెచ్​ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

HC Serious on GHMC Officials
HC Serious on GHMC Officials (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 10:32 AM IST

HC Serious on GHMC Officials :'అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత జీహెచ్​ఎంసీ కమిషనర్​దే. ఆయన బాధ్యతలను విస్మరిస్తే ఆ విధులను ఎవరు నిర్వహించాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సుప్రీం, హైకోర్టులు చెప్పినా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే కేంద్రాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తాం. కోర్టులను తక్కువగా అంచనా వేయొద్దు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు.'

కోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించాల్సి :రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సర్వే నం.51 నుంచి 53 దాకా ఉన్న భూముల్లో అక్రమ, అనుమతుల్లేని నిర్మాణాలకు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలంటూ జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌లకు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అక్రమ నిర్మాణాలను చట్టప్రకారం తొలగించలేదని తేలితే, ఈ కోర్టు గౌరవాన్ని, ప్రతిష్ఠను, అధికారాలను నిలబెట్టడానికి హైకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించాల్సి ఉంటుందని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. గచ్చిబౌలి సర్వే నం.51 నుంచి 53లో ఉన్న 42.24 ఎకరాల్లో అక్రమ నిర్మాణాల తొలగింపునకు నోటీసులు ఇచ్చినా, మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎం.యాదయ్య 2021లో, 2022లోనూ పిటిషన్‌లు దాఖలు చేశారు.

అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు :ఈ భూముల్లో పలువురు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను చట్టప్రకారం తొలగించాలని 2022 జులైలో ఆదేశించినా అమలు చేయకపోవడంతో యాదయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. యథాతథస్థితి ఉత్తర్వులున్నా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కౌంటరు దాఖలు చేస్తూ ఎలాంటి అక్రమ, అనుమతుల్లేని నిర్మాణాలను అనుమతించలేదనడంతో తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయాలని గత ఏడాది ఆగస్టు 30న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ని వాయిదాలిచ్చినా ప్రతివాదులు నివేదిక దాఖలు చేయకపోవడంతో జనవరి 10న అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆన్‌లైన్‌లో హాజరై భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో గానీ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గానీ తన పాత్ర లేదని చెప్పారు.

చట్టప్రకారం తొలగించలేదని :న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతివాదిగా ఉన్న హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందన్నారు. తదుపరి హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రాథమికంగా ఆధారాలను పరిశీలిస్తే ఈ కోర్టు యథాతథస్థితి ఉత్తర్వులు జారీ చేసినా, సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా, అనధికారిక నిర్మాణాలను అధికారులు అనుమతించారని, వాటికి నోటీసులు ఇచ్చి చట్టప్రకారం తొలగించలేదన్నారు. విధులు నిర్వహించాల్సిన కమిషనర్‌ విఫలమైతే అక్రమ నిర్మాణాలను ఎవరు నియంత్రిస్తారని ప్రశ్నించారు. కోర్టులను తక్కువ అంచనా వేయొద్దు, దిల్లీలో అక్రమంగా నిర్మించిన 32 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇలాంటి వాటిపై హైడ్రా ఎందుకు దృష్టి సారించలేదని ప్రశ్నించారు.

రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం అందరూ సమానులేనని, అయితే పెద్దలకు ప్రత్యేక న్యాయం అమలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాల అక్రమణలను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించారు. 10 మీటర్ల స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి క్రమబద్ధీకరణ చేయరని, పెద్దలకు మాత్రం చేస్తారన్నారు. అలా వారికేమైనా ప్రత్యేక చట్టం ఉందా? అని ప్రశ్నించారు.

ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం ప్రభుత్వానికి లేదు : హైకోర్టు

'అంత తొందరెందుకు? - హైడ్రా కూల్చివేతలపై మరోసారి హైకోర్టు అసహనం

దొంగతనం బంగారాన్ని పోలీసులు సీజ్‌ చేయొచ్చా?: స్పష్టత ఇచ్చిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details