ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు - ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై హైకోర్టు ఫైర్​ - HC FIRE ON IAS OFFICER GULZAR

High Court Fire on IAS Officer Gulzar: కారుణ్య నియామకం కింద ఓ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌పై హైకోర్టు మండిపడింది. అధికార విభజన సూత్రాలను అపహాస్యం చేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు న్యాయమూర్తి షోకాజ్‌ నోటీసు జారీ చేస్తూ వివరణ కోరారు.

High Court Fire on IAS Officer Gulzar
High Court Fire on IAS Officer Gulzar

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:09 AM IST

High Court Fire on IAS Officer Gulzar: ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులు ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కార్యనిర్వహణ వ్యవస్థకు ఉన్న లక్ష్మణ రేఖను దాటారని మండిపడింది. న్యాయస్థానంపై ఆయనకు ఎలాంటి గౌరవం లేదని, ప్రభుత్వ అధికారిగా కొనసాగేందుకు అనర్హుడని తేల్చిచెప్పింది.

చట్టబద్ధ పాలన, అధికార విభజన సూత్రాలను అపహాస్యం చేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. హైకోర్టు 2022 ఏప్రిల్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు సుమోటో కోర్టు ధిక్కరణ కింద ప్రాసిక్యూట్‌ చేసి ఎందుకు శిక్షించకూడదో చెప్పాలని మరో షోకాజ్‌ నోటీసు ఇచ్చింది.

Minister Nagarjuna: కారుణ్య నియామకంపై కరుణించమంటే.. మంత్రి గారు కస్సుబుస్సుమంటున్నారు..!

గుల్జార్‌పై సుమోటో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో విచారణను మే 1కి వాయిదా వేశారు. కారుణ్య నియామకం కింద పిటిషనర్‌కు ఉద్యోగం కల్పించేందుకు నిరాకరిస్తూ గుల్జార్‌ 2022 జులై 5న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పిటిషనర్‌ వినతిపై నాలుగు వారాల్లో తాజాగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.

అసలు ఏం జరిగిందంటే తణుకు సర్కిల్‌లో సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేస్తూ బి. సరస్వతిదేవి 2018 ఫిబ్రవరిలో కన్నుమూశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆమె చిన్నకుమారుడు బసవ శ్రీనివాస్‌ చేసిన అభ్యర్థనను అధికారులు 2018లో తిరస్కరించారు. పిటిషనర్‌ వయోపరిమితిని మించారని, పిటిషనర్‌ తండ్రి ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొంది సర్వీసు పెన్షన్‌ పొందుతున్నారనే కారణాలను పేర్కొన్నారు. తన అభ్యర్థనను నిరాకరిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై 2021లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఉద్యోగం నిరాకరిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

'కారుణ్య నియామకాలలో ప్రభుత్వం తీరు సరిగా లేదు'

పిటిషనర్‌కు ఉద్యోగం కల్పించే వ్యవహారాన్ని తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని 2022 ఏప్రిల్‌ 11న ఆదేశాలు ఇచ్చింది. అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. అది విచారణలో ఉండగానే ఆర్థికశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి గుల్జార్‌ 2022 జులై 7న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించారు. దీనిపై పిటిషనర్‌ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా సర్వీసు పెన్షన్‌ పొందితే కారుణ్య నియామకానికి కుటుంబ సభ్యులు అనర్హులని పేర్కొంటూ 2012 మార్చి 24 నాటి ప్రభుత్వ సర్క్యులర్‌ను ఏపీఏటీ 2018 ఫిబ్రవరి 28న కొట్టేసిందని గుర్తు చేశారు.

పిటిషనర్‌ వయసు విషయంలో అధికారుల వాదనను హైకోర్టు గతంలో తోసిపుచ్చిందని తెలిపారు. గతంలో ఏపీఏటీ, హైకోర్టు తప్పుపట్టిన అంశాలనే పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌ అభ్యర్థనను గుల్జార్‌ తిరస్కరించారని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. గుల్జార్​ ఉత్తర్వులు కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ధ పాలనపై గుల్జార్‌కు గౌరవం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారిగా ఆయన అన్‌ఫిట్‌ అని పేర్కొన్నారు. చట్టబద్ధ పాలనను అపహాస్యం చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసిన వారు ధిక్కరణ కింద శిక్షార్హులని పేర్కొన్నారు. షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరారు.

compassionate appointment: కోరుకున్న పోస్టు ఇవ్వడం కుదరదు.. కారుణ్య నియామకాలపై హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details