ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 7:03 AM IST

ETV Bharat / state

వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో పింఛన్లు ఇవ్వట్లేదా? ఈసీ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు - HC on Pension Distribution Issue

HC on Pension Distribution Issue: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేసింది.

HC_on_Pension_Distribution_Issue
HC_on_Pension_Distribution_Issue

HC on Pension Distribution Issue: పింఛన్ల పంపిణీ సజావుగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. అనారోగ్య సమస్యలతో ఇల్లు కదలలేని లబ్ధిదారుల వద్దకే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వెళ్లి పింఛను అందజేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న మెమో ఇచ్చిందని గుర్తుచేసింది.

వాలంటీర్లను పక్కనపెట్టడంతో కార్యాలయాల వద్దకొచ్చి పింఛను అందుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. దేశంలో వాలంటీర్‌ వ్యవస్థ లేని మిగిలిన రాష్ట్రాల్లోనూ పింఛన్ల పంపిణీ జరుగుతోంది కదా, అక్కడ ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అని గుర్తుచేసింది.

సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీ తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వాలంటీర్లపై అందిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని ఈసీ వారిని పక్కనపెట్టిందని గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు చెప్పింది.

ఇళ్ల దగ్గర పింఛన్​ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ? ఉద్యోగులు లేరా ?: పవన్ కల్యాణ్ - Pawan Kalyan on pensions issue

వాలంటీర్లను దూరం పెట్టడంతో తమకు పింఛన్‌ అందడం లేదంటూ కొందరు మహిళలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ధర్మాసనం కొట్టేసింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కనపెడుతూ ఈసీ మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛనుదారులు హైకోర్టులో పిల్‌ వేశారు.

వారి తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఒకటో తేదీన ఇంటికొచ్చి పింఛను అందించే వాలంటీర్లను నిలువరించడంతో వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టమైందన్నారు.

ధర్మాసనం స్పందిస్తూ వాలంటీరు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద లబ్ధిదారులకు పింఛన్‌ అందజేస్తారని దివ్యాంగులు, గడపదాటి బయటకు రాలేని వ్యక్తులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందజేసేందుకు తమ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌దేశాయ్‌ వాదనలు వినిపించారు.

ఈసీ వివరణపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. మరోవైపు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండా ఈసీ ఏకపక్షంగా పింఛను పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిందన్నారు. రాజకీయ ప్రేరేపిత కారణాలతో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యవహారానికే వాదనలు పరిమితం కావాలని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిల్‌ను కొట్టేసింది.

పింఛను కోసం వచ్చి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడు - OldManCame Pension Fell Unconscious

ABOUT THE AUTHOR

...view details