High Court Dismiss Pension Distribute Petition:పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి వరలక్ష్మి, మరో ఇద్దరు పెన్షన్‌దారులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని ప్రశ్నించింది. సీఎస్ జవహర్ రెడ్డి మంగళవారం పింఛన్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో అందజేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టుకు తెలిపారు.
సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీ (Election Commission of India) ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్. రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన వి. వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్‌దారులు పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ అందించేవారని తాజా ఉత్తర్వుల వల్ల వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టంగా మారిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. సజావుగా పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టి వేస్తున్నట్లు కోర్టు తెలిపింది.