Ram Gopal Varma Reaction About Cases : తనను అరెస్టు చేస్తారని ఓ వర్గం మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేసి తన పరువునకు భంగం కలిగించిందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కిందట తన ఎక్స్ ఖాతాలో చేసిన వ్యంగ్య చిత్రాలకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో నమోదైన కేసులపై విచారణ కోసం సమయం కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించానని పేర్కొన్నారు. ఈ విషయంలో కోర్టు పరిధిలో ఉండగా పోలీసులతో కలిచి వచ్చిన పలు ఛానళ్ల ప్రతినిధులు తాను పరారీలో ఉన్నట్లు ప్రచారం చేశారని, నాగార్జున, ప్రకాశ్ రాజ్ ఆశ్రయం కల్పించారనే కట్టుకథలు అల్లినట్లు వర్మ మండిపడ్డారు.
ప్రపంచమంతా ఉంది: తనపై నమోదైన కేసులు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయనే అనుమానంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే చట్టాన్ని గౌరవించి జైలుకు వెళ్తానని, జైల్లో ఉన్న ఖైదీలతో స్నేహం చేసి నాలుగు సినిమా కథలు రాసుకుంటానని ఆర్జీవీ చమత్కరించారు. కార్టూన్ బొమ్మలతో సామాజిక మాద్యమాల్లో వ్యంగ్యంగా మాట్లాడటం ప్రపంచమంతా ఉందని, అమెరికా లాంటి దేశాల్లో కూడా వాటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా కంటే ప్రధాన మీడియానే భయంకరంగా తయారైందని ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు.