Heavy Traffic Issues in Hyderabad :అత్యవసరమని కారు లేదా బైక్‌తో రోడెక్కితే చాలు ట్రాఫిక్. అందులో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. దీనికి పగలు, రాత్రి అనే తేడానే లేదు. ఇలా ట్రాఫిక్ ఉన్నప్పుడు అక్కడ పోలీసు కనిపించడు. ఈ రద్దీని పర్యవేక్షించాల్సిన అధికారులే అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పుడు ఈ సమస్య హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్, కళాశాలకు వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులను చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది.
Public Facing Problems Due To Traffic Jam in Hyderabad : ఎన్నికలకు ముందు ఉన్న ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ ఎన్నికల కోడ్ సమయంలో బదిలీ అయ్యారు. ఇన్ఛార్జిపై అదనపు భారం పడటంతో పర్యవేక్షణ భారంగా మారింది. కీలకమైన ఈ పోస్ట్ మూడు నెలల నుంచి ఖాళీగానే ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్లుగా ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని పెంచకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
నగరంలో 25 లక్షలు పైనే వాహనాలు :గతంలో గ్రేటర్ పరిధిలో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లపైకి వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 20 శాతం పెరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరగడం, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. దీంతో వాహనాల సంఖ్య రెట్టింపు అయింది. అదే విధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్, కాలేజీ బస్సులు రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంకా వాహన రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖుల వాహనాలు, ప్రొటోకాల్ అని చెప్పి తరచూ ట్రాఫిక్‌ను నిలిపి వేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనాలు : ప్రైవేట్ బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. ఇలా గతంలో నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ప్రైవేట్ వాహనదారులు చలాన్లు వేయడం వల్ల పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 40లక్షల ఘటనల్లో వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు గుర్తించారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.