Temperature Rises in India 2024 :దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటకముందే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ఆదేశాలు ఇచ్చింది. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) మార్గదర్శకాల మేరకు డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్సలు అందించాలని సూచనలు చేసింది. మార్చి 1 నుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో నమోదైన వడదెబ్బ కేసులు, చికిత్సలు, మృతుల వివరాలను నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ అండ్ హ్యూమన్‌హెల్త్ పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొంది.
ఈ లక్షణాలు కనిపిస్తే : వడదెబ్బకు గురైనప్పుడు పెద్దల్లో ఆందోళన, చిరాకు, మూర్ఛ, అయోమయం, గందరగోళం, కోమా లక్షణాలు, శరీరం వేడిగా, చర్మం ఎర్రగా, తేమలేకుండా మారడం, శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్‌కు మించి నమోదు కావడం లాంటివి ఉంటాయి. అలాగే తలనొప్పి, ఆందోళన, తిమ్మిరి, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాల బలహీనత, వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారులు ఆహారం తీసుకోవడానికి నిరాకరించడం, నోరు పొడిబారడం, బద్ధకం, మూర్ఛ, చికాకు, మూత్రం సరిగా రాకపోవడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.