Heavy Rains In Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న రాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతుంది. క్యూ లైన్లో ఉన్న భక్తులు వర్షానికి తడవకుండా టీటీడీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్విరామంగా భక్తులకు మంచినీళ్లు, పాలు, అల్పాహారం ఇస్తున్నారు. మరోవైపు స్వామి వారి దర్శనం చేసుకొని ఆలయం వెలుపలకు వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దవుతున్నారు.
తిరుమలలో భారీ వర్షం :తిరుమలలో వర్షం కారణంగా మంచు కమ్ముకొని చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు, ఘాట్ రోడ్‌లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు జారిపడే ప్రమాదం ఉండడంతో వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలని టీటీడీ సూచించింది. ముందు జాగ్రత్తగా ఇంజనీరింగ్, విజిలెన్స్ సిబ్బందిని రెండు ఘాట్ రోడ్లలో అధికారులు అందుబాటులో ఉంచారు.
పంటలు నష్టపోయిన రైతులు :అల్పపీడన ప్రభావంతో ఒంగోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత నెలలో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎనిమిది రకాల పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, వరి, కొర్ర, సజ్జ, మినుము, జొన్న, అలసంద, పొగాకు పంటలకు నష్టపోయాయి. వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేశారు. 8,429 మంది రైతులు తమ పంటలు నష్టపోయినట్లు తెలిపారు.