Heavy Rains in Nellore District:తుపాను తీరం దాటినా నెల్లూరు జిల్లాను వర్షాలు వీడటం లేదు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా తడిచి ముద్దవుతోంది. నగరంలో రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతు వర్షపు నీరు ప్రవహించింది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిల్లో నీరు చేరగా, సండే మార్కెట్, ట్రంకురోడ్డ్, శివప్రియా సెంటర్, గాందీ బొమ్మ, కాంప్లెక్స్ రోడ్డ్, కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ప్రాంతాలు వర్షం నీటిలో మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎగువ నుంచి వస్తున్న జలాలతో పెన్నా నదులోనూ వరద ప్రవహిస్తోంది. కోవూరు నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది.
అన్నదాతల ఇబ్బందులు:ఇప్పటికే పలు మండలాల్లో నారుమళ్లు నీట మునిగి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కోవూరు, బుచ్చిరెడ్దిపాలెం, విడవలూరు ప్రాంతాల్లో కుంభవృష్టగా వర్షం కురిసింది. రైల్వే అండర్ బ్రిడ్జిలు వద్ద భారీగా నీటి ప్రవాహం చేరింది. రాకపోకలుకు అంతరాయం కలిగింది. కనకమహల్ సెంటర్, పొదలకూరు రోడ్డు, గాంధీ బొమ్మ కూడలి, కరెంట్ ఆఫీస్ ప్రాంతాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలోని 13 మండలాల్లో అధిక వర్షపాతం నమోదవగా, 22 మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాన తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి నారుమడులు, వరినాట్లు దెబ్బతిన్నాయి.
తీవ్ర వాయుగుండంగా మారనున్న తుపాను- పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్లకు అవకాశం
ఇద్దరు యువకులు గల్లంతు:జిల్లాలోని చిట్టమూరు మండలం తంగేడు సమీపంలోని వరద ప్రవాహంలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ద్విచక్రవాహనంపై మల్లాం వైపు వెళ్తూ రొయ్యల వాగు ప్రవాహానికి కొట్టుకుపోయరు. గల్లంతైన వారు మధురెడ్డి(40), షారుఖ్(23)గా గుర్తించారు. ఇద్దరు యువకులు కోటలోని ఓ చికెన్ దుకాణంలో పనిచేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వరద ప్రవాహాన్ని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యువకుల కోసం స్థానికులు పోలీసులు గాలిస్తున్నారు.
నిండుకుండలా జలాశయాలు:ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాలు, బ్యారేజీలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 70 టీఎంసీలగా నీటి నిల్వ నమోదు అవుతుంది. ఇన్ ఫ్లో 10500 క్యూసెక్కుల వరద వస్తూ ఉండడంతో 3000 క్యూసెక్కుల నీటిని అధికారులు పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయం నుంచి వస్తున్న వరద నీటితో సంగం బ్యారేజికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో పెన్నా పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సంగం బ్యారేజీ 6 గేట్లను ఎత్తి 4500 క్యూసెక్కుల నీటిని సముద్రానికి విడుదల చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు: కుండపోత వర్షాలకు పాఠశాలకు వెళ్లలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. భారీ వర్షానికి రోడ్లన్నీ బురదమయ్యాయి. గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లేందుకు కిలో మీటరు దూరం ఉండటంతో కొంతమంది విద్యార్థులు బురదలో జారి కింద పడుతున్నారు. మరికొందరు పాఠశాలకు వెళ్లలేక ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. ఇటీవల కాలనీలో ఓ వ్యక్తి మరణిస్తే బురద రోడ్లపై శవాన్ని తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నూతన రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పిడుగుపడి వ్యక్తి మృతి: సంగం మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన చిట్టి బోయిన వెంకటేశ్వర్లు తన పంట పొలంలో వరి నారు లాగేందుకు భార్య ఆది లక్ష్మమ్మతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పంట పొలంలో ఉన్న భార్య, భర్త ఇద్దరిపై పిడుగు పడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే చనిపోగా భార్య ఆదిలక్ష్మమ్మకు గాయాలు కాగా ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పెళ్లి కావలసిన ఇద్దరు కుమారులు తండ్రి మరణంతో బోరున విలపిస్తున్నారు.
తిరుమలలో భారీ వర్షం - శ్రీవారి భక్తులకు ఆ మార్గాల్లో నో ఎంట్రీ
అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఫెంగల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష