Heavy Rains Effect in Telangana :రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో పిడుగు పడి తాత-మనవడు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. పిడుగు పాటుతో గాయపడిన ఐదుగురికి వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన తాతా మనవళ్లు :పిడుగుపడి తాతా మనవళ్లు మృతి చెందిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని రామోజీపల్లిలో చోటుచేసుకుంది. వర్షం కురుస్తుండటంతో స్థానిక ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడుస్తోందని చెప్పి పల్వంచ శ్రీరాములు (51), అతని మనుమడు విశాల్ (11) వడ్ల కుప్పల మీద టార్పాలిన్లు కప్పడానికి వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చి, పిడుగు పడే పరిస్థితి కనిపించింది.
చెట్టు కిందకు వెళితే పిడుగు పడుతుందనే భయంతో వర్షం పడుతున్నా ఖాళీ సంచులు తలపై కప్పి వడ్ల కుప్ప దగ్గరే ఉన్నారు. అయితే వారికి సమీపంలోనే పిడుగు పడటంతో శ్రీరాములు, విశాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనూహ్యంగా పిడుగుపడి తాతా మనవళ్లిద్దరూ మృతి చెందడంతో రామోజీపల్లి లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
CM Revanth Issued Key Orders To Officials :భారీ వర్షాల పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో గాలివాన, పిడుగులు పడిన వివరాలపై సీఎం ఆరా తీశారు.
ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా అధికారులు, సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుతో గాయపడిన ఐదుగురికి వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.