Heavy Rains Effects in AP 2024 : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆనుకున్న ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తనం ఏర్పడి ఏపీవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, కడప, అన్నమయ్య జిల్లాల్లో పంట పొలాలు నీటమునిగాయి. రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. వర్షాలు భారీగా కురుస్తున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వానలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవం అస్థవ్యస్థమవుతోంది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు సూచిస్తున్నారు. కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావొద్దు : నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు ఎవరూ రావొద్దని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు. ఆవర్తన ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సూచించారు.
ఏపీలోని వర్షం పరిస్థితిని విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోదియా పర్యవేక్షిస్తున్నారు. విపత్తు వేళ తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ అధికారులు అలెర్ట్‌గా ఉండాలని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
ఈదురుగాలుల తీవ్రతను బట్టి పవర్ డిపార్ట్మెంట్ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాల ప్రభావంతో కాలువలు, వాగులు పొంగే రోడ్లను వెంటనే మూసేయాలని ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివాసముండే వారిని సచివాలయ సిబ్బంది సేఫ్ ప్రదేశాలకు తరలించాలని చెప్పారు. కాలువలు, చెరువులు, వాగుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.