Red Alert Issued For North Andhra : బంగాళాఖాతంలో ఒడిశా- బంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం క్రమంగా వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండురోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానాంలకు భారీ వర్షం సూచన ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు :విజయనగరం, విశాఖ, తూగో, పగో జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా 70 కి.మీ బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కళింగ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలకు విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. కొండచరియలు పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
గోపాలపట్నంలోని రామకృష్ణానగర్ కాళీమాత గుడి దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లకు ప్రమాదం పొంచివుంది. ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపారు. మిగతా ఇళ్లకు కూడా ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం :వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. సొంత వాహనదారులు, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. కొండ చరియలు, చెట్లు విరిగి పడే అవకాశం ఉన్నందున ప్రయాణాలు విరమించుకోవాలని కోరుతున్నారు.