Heavy Rains in Warangal District : కుండపోత వర్షాలకు వచ్చిన వరదలు వరంగల్ ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేశాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మహబూబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైన చోట సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్‌ల మధ్య కిలోమీటర్‌పైగా రైల్వేట్రాక్ కోతకు గురైంది. పట్టాలు గాల్లో వేలాడాయి.
పెద్దబంధం చెరువు కట్ట తెగడంతో వరదతాకిడికి మహబూబాబాద్ తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ సుమారు 300 మీటర్ల మేర కోతకు గురైంది. అప్రమత్తమైన సిబ్బంది రైళ్లను ముందు స్టేషన్లలో నిలిపివేయగా పెనుప్రమాదం తప్పింది. కేసముద్రం ఇంటికన్నె వద్ద తాళ్లపూసపల్లి మహబూబాబాద్ మధ్యలోనూ ట్రాక్ మరమ్మతు పనులు మొదలయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో అత్యధిక వర్షపాతం : జోరువర్షాలు, వరదలతో ఆకేరు, మున్నేరు, పాలేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి 45.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు మత్తుడ్లు పడడంతో రహదారులపైకి నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నెక్కొండ మండల కేంద్రంలోని వెంకటాపురం వద్ద తోపనపల్లి వాగు పొంగడంతో మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. బస్సులో 40 మంది ప్రయాణికులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం కలెక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకొని బస్సులో చిక్కుకున్న 40 మందిని కాపాడారు.
మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయిగూడెం వద్ద ఆకేరు వాగులో కొట్టుకపోయిన కారు ఆచూకీ లభ్యమైంది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్‌కాపల్లి గంగారం తండాకి చెందిన తండ్రి, కుమార్తె మోతీలాల్, అశ్విని హైదరాబాద్‌కి బయలుదేరారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి వారు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం ఓ రైతుతోటలో లభ్యమైంది. తండ్రి మోతిలాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వరంగల్‌లో నీట మునిగిన పలు ప్రాంతాలు భారీ వర్షాలకు వరంగల్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మధుర నగర్‌తో పాటు సాయి గణేష్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, ఎస్సార్ నగర్‌తో పాటు గిరిప్రసాద్ నగర్ వీరన్నకుంట ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండలోని ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. గిరి ప్రసాద్ నగర్ వీరన్న కుంట కాలనీవాసులను గుజరాత్ భవన్‌కి తరలించగా, మధురానగర్‌లో 9 నెలల గర్భవతిని డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.