Heavy Rain Effect In Hyderabad : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. బుల్కాపూర్, కూకట్పల్లి, బంజరా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో నీటిమట్టం పెరిగి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎఫ్టీఎల్కు అడుగుదూరంలో ఉండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లో వరదనీటి పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ కూడా సాగర్‌లోని నీటిమట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను వివరాలడిగి తెలుసుకుంటున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని ఆయన సూచించారు.
Hydra Commissioner visits Flood Affected Areas : నగరవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. షేక్‌పేట, టోలిచౌకీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. టోలిచౌకి వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీటిని దగ్గరుండి సిబ్బందితో నాలాలోకి మళ్లించారు. అలాగే బేగంపేట ముంపు ప్రభావిత ప్రాంతాలతోపాటు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నాలాను, పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.