Heavy Rain Alert To Telangana :రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 12 గంటల్లో అల్పపీడనం వాయు గుండంగా మారే అవకాశముందని పేర్కొన్నారు. విరామం కాం లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. చాలా గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ : హైదరాబాద్‌లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. మహదేవపూర్, కాళేశ్వరం మార్గంలో ఎడపల్లి వాగు ఉప్పొంగడంతో లోలెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కేశవపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరుకుంట-గుండ్రాత్ పల్లి మధ్య వాగు ఉధృతిలో బొలెరో వాహనం కొట్టుకుపోయింది. గ్రామస్థుల సాయంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.