Telangana Rains 2024 :శనివారం రాత్రి మొదలు ఆదివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వాగులు ఉప్పొంగడంతో ఊహకందని విషాదం చోటుచేసుకుంది. ఈ విపత్తు ఊహకందనిదని చెప్పుకోవచ్చు. ముంపు బాధితులకు అది ఏళ్లపాటు కన్నీటికి కారణమైంది. ఏ ఒక్కరిని పలుకరించినా కన్నీరే సమాధానం అవుతోంది. ఖమ్మంలోని మున్నేరు నగరంపై విరుచుకుపడింది. ఎన్నడూ లేన్నంటి విపత్తు, ఆ నగరాన్ని సగం ముంచింది.
ముంచిన మున్నేరు : ఖమ్మం నగరం సమీపంలోని మున్నేరు వాగులో ప్రవాహ ఉద్ధృతి పెరగడంతో పరీవాహకంలోని కాలనీలు, బస్తీలు మునిగిపోయాయి. సుమారు 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. 10 అడుగుల మేర వరద ప్రవహించడంతో కొన్ని భవనాల రెండో అంతస్తు వరకు నీరు చేరింది. మూడో అంతస్తు, అపైన ఉన్న భవనాలపైకి జనం చేరుకుని సాయం కోసం ఎదురుచూశారు. ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారుల అంచనా.
వరదలతో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లు, దుకాణాల నుంచి సరకులు వరదపాలు అయ్యాయి. వరదముంపుతో పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. దెబ్బతిన్న వీధులు, ఇళ్లను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి నివాసంలోనూ 2 నుంచి 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు వేసింది. కన్నీటిని తుడుచుకోవడానికి కనీసం తువ్వాలు కూడా లేని దయనీయ పరిస్థితి వారిది.
జీవితాలు దుర్భరం :ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. ఏళ్ల కష్టం వరదపాలైంది. ప్రస్తుతం ప్రశ్నార్థకంగా, భవిష్యత్ అంధకారంగా మారిందని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. తమ జీవితాలు యథాస్థితికి రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు, నదులు ఉప్పొంగితే అవీ నగరం మధ్యలో ఉంటే ఎంత ప్రమాదకరమే చెప్పడానికి విజయవాడ, మున్నేరు ఘటనలే నిదర్శనం.
హైదరాబాద్‌లో గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. 2020లో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. ఏటా 800మిల్లీమీటర్ల నమోదయ్యే వర్షాపాతం, వారం రోజుల్లోనే 700 మిల్లీమీటర్లు నమోదైంది. నాటి వర్షం దాటికి ఎల్‌బీనగర్ నియోజకవర్గం హరిహరపురంలోని 700 కాలనీలు, దిగువన 18 కాలనీలు నెలరోజుల పాటు నీటిలోనే ఉన్నాయి. మన్సూరాబాద్‌లోని చెరువు కింద ఉన్న సరస్వతినగర్, ఆగమయ్యకాలనీ, ఇతరత్రా ప్రాంతాల్లోని వెయ్యికిపైగా ఇళ్లు వరదలో మునిగాయి.
సుష్మా చౌరస్తా వరకు ముంపు తలెత్తింది. గుర్రం చెరువుకు గండిపడటంతో పాతబస్తీలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలీచౌక్‌లోని నదీంకాలనీ పూర్తిగా నీట మునిగింది. విరాహత్ నగర్, నీరజ్ కాలనీ, బాలరెడ్డినగర్ కాలనీల్లో వరద నీరు చేరింది. జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌లోని వరద నీరు పూర్తిగా చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నదీంకాలనీ, విరాసత్ కాలనీని ముంచేసింది. గతేడాది వరంగల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అకాల వర్షంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఒక అంతస్తు వరకు నీరు చేరగా, ఇళ్లపైకి ఎక్కి వరంగల్ వాసులు ప్రాణాలు కాపాడుకున్నారు .
జనజీవనం అస్తవ్యస్తం :వాస్తవానికి మన దేశంలో నదులను దేవతలుగా భావిస్తారు. ఒక చోట పుట్టి వివిధ ప్రాంతాలను చుట్టేస్టాయి నదులు, వాగులు. భూగర్భ జలాల పెంపునకు ఇవి దోహదపడతాయి. అలాంటివే విజయవాడలోని బుడమేరు, ఖమ్మంలోని మున్నేరు. అంతటి ప్రాముఖ్యత కలిగిన నదులు, వాగులు భారీ వర్షాలతో విపత్తులనూ తీసుకొస్తున్నాయి. సామర్థ్యానికి మించి వస్తున్న వరదలతో చుట్టుపక్కల ప్రాంతాలను ముంచేస్తున్నాయి. ఇళ్లు, కాలనీలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నింటినీ తమలో మిళితం చేసుకుంటున్నాయి. ఫలితంగా లక్షలాది మంది కన్నీటికి కారణం అవుతున్నాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
రైతు కడుపు కొట్టిన వానలు - వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు - HUGE CROP DAMAGE IN TELANGANA
తెలంగాణ ప్రకృతి విపత్తుపై నివేదిక అందలేదు - సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ - UNION GOVT ON TELANGANA SDRF FUNDS