తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ అలవాట్లే బ్రెయిన్‌స్ట్రోక్‌, హార్ట్‌ ఎటాక్‌లకు కారణం! - ఇవి పాటిస్తే వాటిని నివారించుకోవచ్చు - HEART AND BRAIN STROKE

చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్న యువకులు - ముప్పు తెస్తున్న జంక్‌ఫుడ్‌, కల్తీ నూనెలు - బీపీ, షుగర్, స్థూలకాయం, మద్యం, పొగ తాగే అలవాటుంటే గుండెపోటు వచ్చే అవకాశం -వ్యాయామం, నడక తప్పనిసరి

STROKE PREVENTION GUIDELINES
Heart Attack and Brain Stroke Symptoms (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 1:23 PM IST

Heart Attack and Brain Stroke Symptoms : వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటకు చెందిన రాజేశ్​ హైదరాబాద్​లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వెళ్లగా బంధువులు, స్నేహితులతో మాట్లాడుతూ కింద పడిపోయి చనిపోయాడు. అతను మరణించడానికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. మెదక్​ జిల్లాలో మనోహరాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు పని చేస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. అతడు దాదాపు 95 కిలోలు ఉండగా ప్రతిరోజు ఫాస్ట్‌ఫుడ్‌ తినడం అలవాటు. వ్యాయామం, వాకింగ్​ లాంటివి లేకపోవడంతో చివరకు ప్రాణం మీదకు వచ్చింది.

ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. జీవన శైలిలో వచ్చిన మార్పులే ఒక కారణంగా చెప్పొచ్చు. దీంతో చిన్న వయసు పిల్లలు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. ఎంతో మందిపక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్‌), గుండెపోటు (హార్ట్‌ఎటాక్‌) బారిన పడుతున్నారు. ఇంతకముందు కొంత వయసు వచ్చాకే వీటి బారినపడేవారు. కానీ ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇవాళ ప్రపంచ స్ట్రోక్‌ డే సందర్భంగా ఉమ్మడి వికారాబాద్‌, మెదక్​ జిల్లాల్లోని పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రత్యేక కథనం.

నెలకు అర లీటరు నూనె మించొద్దు :ఉమ్మడి వికారాబాద్‌, మెదక్​ జిల్లాల్లోని జనాభాలో సగానికి పైగా యువతే ఉంటారు. అయితే వీరు అత్యధికులు జంక్​ఫుడ్​ తింటున్నారు. వీధికొకటి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉండడంతో వీటి ముందు క్యూ కడుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరు నిత్యం 20 గ్రా.ల నూనె మాత్రమే వాడలనేది నిపుణుల సూచన. దీనికి ప్రకారం చూసుకుంటే నెలకు అర లీటరు సైతం మించొద్దు. కారం, మసాలాలు, ఉప్పు అధికంగా వాడటమూ ముప్పే. ఇదే కాకుండా కల్తీ సైతం ముప్పే తెస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని నాసిరకమైన నూనెలు వాడొద్దని సూచిస్తున్నారు.

'రోజుకు కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు అయిన నడవాలి. వాకింగ్​తోపాటు వ్యాయామం కూడా తప్పనిసరి. నూనె పదార్థాలకు, జంక్‌ఫుడ్​కు దూరంగా ఉండాలి. సిగరెటు, మద్యానికి దూరంగా ఎంతో మేలు. ఉప్పు, కారం తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. పోషకాహారం తప్పనిసరిగా తీసుకుంటే స్ట్రోక్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి'- డా. రామచంద్రయ్య, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, వికారాబాద్‌

మద్యం, స్థూలకాయం ముప్పే : ఇటీవల కాలం ఇప్పటి యువత ఎక్కువగా జంక్​పుడ్​ను ఇష్టపడుతున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఇతర కారణాలతో స్థూలకాయం ముప్పున పడుతున్నారు. మద్యానికి సైతం అలవాటు పడి అనారోగ్యానికి గురువుతున్నారు. బీపీ, షుగర్, స్థూలకాయం ఉన్నావారికి, మద్యం, పొగ తాగే అలవాటు ఉండేవారికి గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో జనరల్​ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా చోట్ల బ్రెయిన్‌స్ట్రోక్‌తో నెలకు 60 నుంచి 80 మంది వస్తున్నారని వైద్యుల చెబుతున్నారు. ఆసుపత్రుల్లో పరీక్షించి మందులు అందిస్తున్నారు.

పక్షవాతం (బ్రెయిన్‌స్ట్రోక్‌) : పక్షవాతానికి గురైతే ఒక్కసారిగా చేతలు, కాళ్లు పడిపోతాయి. మూతి వంకరపోతుంది. మాటలు తడబడతాయి. వెంటనే రోగిని ఆరు గంటల్లోపే ఆసుపత్రికి తరలిస్తే వైద్యులు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత బాధితులు జీవతకాలం మందులు వేసుకోవాల్సిందే. ఆరు నెలలకోసారి సైతం వైద్యులను సంప్రదించాలి.

గుండెపోటు లక్షణాలు : హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు ఛాతీలో ఎడమవైపు నొప్పి వస్తుంది. ఏదో బరువు మోస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయాసం, చెమటలు పడతాయి. కొంతమందికి అయితే ఎలాంటి లక్షణాలు లేకుండా హార్ట్‌ఎటాక్‌ రావొచ్చు. ఇటీవల ఓ 55 ఏళ్ల వయసు గల వ్యక్తి గడ్డి కోస్తుండగా గుండెపోటు వచ్చి మరణించాడు. అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు రావడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెంటనే అన్నీ పరీక్షలు చేసి ఫలితాలకు అనుగుణంగా చికిత్స చేస్తారు. అవసరమైతే యాంజియోగ్రామ్ చికిత్స అందిస్తారు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బీ అలర్ట్‌ - ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని కలవండి - Brain Stroke Symptoms

ABOUT THE AUTHOR

...view details