Health Benefits of Eating Different Types of Millets Daily :మారిన జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లు, గాడితప్పిన శారీరక శ్రమ, నిద్రలేమి తదితరాలతో 30 ఏళ్లు నిండకుండానే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులు చుట్టుముడుతున్నాయి. ఒక్కసారి వీటి బారినపడిన తర్వాత జీవనశైలి మార్పుపై దృష్టి పెట్టాల్సి వస్తోంది. నిజానికి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో ఆహారం పాత్ర గణనీయంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అందులోనూ ‘తృణ ధాన్యాలు (మిల్లెట్స్)’ అద్భుత ఆహారంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. వరి, గోధుమల ఆహారాలకు అలవాటు పడిన మనలో అధికులకు వీటిని తీసుకోవడం అంతగా రుచించదు. సహజంగా నాలుకకు రుచికరంగా ఉన్న ఆహారాలనే తినడానికి ఎవరైనా ఇష్టపడుతుంటారు.
అయితే ఇటీవల కాలంలో తృణధాన్యాల ఆహారాలను కూడా రుచికరంగా, భిన్నమైన రూపాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని, తద్వారా జీవనశైలి వ్యాధుల ముప్పును అరికడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
"మిల్లెట్ సూపర్ ఫుడ్" - ప్రముఖ వైద్యులు ఏమంటున్నారంటే! (ETV Bharat) ‘తృణధాన్యాలతో ఆరోగ్య సంరక్షణ’పై శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ‘సబల మిల్లెట్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పలువురు నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ చర్చకు సంజయ్ అరోరా సమన్వయకర్తగా వ్యవహరించగా.. ఇందులో ఏఐజీ హాస్పిటల్స్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల, ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాశశి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) హైదరాబాద్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బి.దయాకర్‌రావు, డైరెక్టర్ ఆఫ్ ఐకార్ డాక్టర్ సి.తారా సత్యవతి పాల్గొన్నారు. చర్చలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రియాఫుడ్స్ మరో ముందడుగు - 45 రకాల చిరుధాన్యాలతో 'భారత్ కా సూపర్‌ఫుడ్'
మిల్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటర్లు:50, 60 ఏళ్ల కిందట మిల్లెట్స్‌నే ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. కాలక్రమంలో బియ్యం, గోధుమలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇటీవల కాలంలో మళ్లీ మిల్లెట్స్ వైపు చూస్తున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో చాలామంది అరుగుదల సమస్య ఎదురవుతుందని, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని మా దగ్గర ప్రస్తావిస్తుంటారు. నిజానికి వీటిని తినడం వల్ల ఎలాంటి అజీర్తి సమస్యలు రావని, పైగా కొంచెం తినగానే ఎక్కువ తిన్నామనే భావన రావడం కూడా మంచిదేనని డా.రాకేష్ తెలుపుతున్నారు.
తద్వారా తక్కువ మోతాదులో తింటారని, తీసుకునే క్యాలరీల మోతాదు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే మిల్లెట్స్‌ను ఎలా తీసుకుంటున్నామనేది ప్రధానమంటున్నారు. తొలిసారి ఆహారంగా తీసుకుంటున్నప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా స్వల్ప మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలని తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బియ్యం, గోధుమల ఆహారాలకు అలవాటు పడిన జీర్ణవ్యవస్థ తృణధాన్యాలకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుందని సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అంటున్నారు.
'జీర్ణకోశ వైద్యనిపుణుడిగా నేను చెప్పేది ఏమిటంటే నాలుకకు రుచించని ఆహారంలోనే వాస్తవానికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఆహారం తీసుకున్నా అది మన రక్తంలో షుగర్ స్థాయులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చాలా కీలకం. ఇప్పుడు జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ వైద్యులందరూ తీసుకున్న ఆహార ప్రభావం రక్తంలో గ్లూకోజ్ స్థాయులపై ఏవిధంగా ఉంటుందనేది పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఏరకమైన తృణధాన్యాలతో ఎంత మేరకు రక్తంలో షుగర్ స్థాయులు స్థిరంగా ఉంటున్నాయనేది కూడా పరిశీలిస్తున్నారు. రక్తంలో షుగర్ స్థాయులు తక్కువగా ఉండాలంటే మిల్లెట్స్ వాడకం మంచిది.' -డాక్టర్ రాకేష్ కలపాల
తృణ, పప్పు ధాన్యాలనూ వైవిధ్యంగా తీసుకోవాలి :జీవనశైలి వ్యాధులను నివారించడం, అరికట్టడంలోనూ తృణ ధాన్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే సులువైన విధానాల ద్వారా ఎక్కువగా ధాన్యం పైపొర తొలగిపోకుండా వాడుకునే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నానబెట్టి ఉడకబెట్టి తింటే మంచిదంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లతాశశి. తద్వారా పోషక విలువలు తగ్గిపోవని, అజీర్తి సమస్యలూ ఎదురుకావని తెలుపుతున్నారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా అంతగా ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం వండుకోవడానికి ఎక్కువ సమయం పట్టడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మిల్లెట్స్‌ను వివిధ రూపాల్లో వినియోగించుకోవచ్చనే అవగాహన పెంపొందించడానికి ఈ వేదిక దోహదపడుతోందని తెలిపారు. కొందరు రాగి ముద్దను మాంసంతో తింటారు. శాకాహారులైతే తృణ ధాన్యాలను పప్పుధాన్యాలతో కలిపి తినాలని, ఆహారంలో వైవిధ్యం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందంటున్నారు. పీచును కూడా మోతాదుకు మించి తినడం శ్రేయస్కరం కాదుని, జీర్ణవ్యవస్థ పనితీరును బట్టి రోజుకు ఒకటి, రెండుసార్లు మిల్లెట్స్‌ను తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
భవిష్యత్‌లో తృణధాన్యాలతో ఆహార భద్రత :పూర్వకాలం నుంచీ తృణధాన్యాలను రైతులు పండించేవారు. వాళ్లే తినే వారు. అవి ఎప్పుడూ వాణిజ్య పంటలుగా గుర్తింపు పొందలేదు. ముఖ్యంగా వీటిని ఆహారాలుగా వినియోగించేందుకు అనువైన ప్రక్రియలు పెద్దగా అందుబాటులేవు. గోధుమ పిండితో చపాతీలు ఎంత తేలిగ్గా చేయగలుగుతారో అంత సులువుగా మిల్లెట్స్‌తో వంటకాలు చేయడంపై అవగాహన లేదు. ఆధునిక కాలంలో వేగంగా వంటకాలు చేసుకుంటున్న పరిస్థితుల్లో తృణ ధాన్యాలతో ఉపయోగం ఉందని తెలిసినా వాటిని సులువుగా చేసుకోలేక పక్కనబెడుతున్నారని డా.బి.దయాకర్‌రావు వివరించారు.
వీటి వల్ల పోషక విలువలు పెరగడంతో పాటు జీవనశైలి వ్యాధుల బారినపడకుండా కూడా జాగ్రత్తపడొచ్చు. దాదాపు 70 ఏళ్లుగా మిల్లెట్స్‌ను మనం నిర్లక్ష్యం చేశాం. ఇటీవల కాలంలో మళ్లీ తృణ ధాన్యాల ప్రయోజనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిపై అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రచారం కల్పిస్తున్నారు. భూతాపం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో వర్షాలు తగ్గిపోతున్నాయి. ఈ స్థితిలో తక్కువ నీటి వనరులతో పండించే మిల్లెట్స్‌కు ఆదరణ ఉంటుంది. భవిష్యత్‌లో ఒకవేళ వరి, గోధుమల కొరత ఏర్పడినా తృణ ధాన్యాలతో ఆహార భద్రత లభిస్తుందని పేర్కొన్నారు.
అందుబాటులో మిల్లెట్స్ రెడీమెడ్ వంటకాలు :మిల్లెట్స్ అనేది భారత్‌లో కొన్ని తరాలుగా ఉన్న ఆహార ధాన్యాలే. రాన్రానూ మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా పక్కకు వెళ్లిపోయాయి. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే వరి, గోధుమలను ఆహారంగా తీసుకోవడం అలవాటైంది. కానీ ఇటీవల కాలంలో మళ్లీ తృణధాన్యాల ఆహారాలపై ఆసక్తి పెరుగుతోంది. జీవనశైలి వ్యాధుల ప్రభావంతో ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా ప్రియా ఫుడ్స్ ఈ తరహా ఆహారాలను తీసుకురావడం అభినందనీయం. ఒక గృహిణిగా, ఉద్యోగినిగా తానూ సులువుగా చేసే వంటకాలను ఇష్టపడతానని డాక్టర్ సి.తారా సత్యవతి తెలిపారు.
ఎక్కువ సమయం తీసుకొని వండాలంటే ఈ ఆధునిక కాలంలో ఎక్కువమంది మహిళలకు కష్టమే. అందులోనూ వర్కింగ్ ఉమెన్‌కు ఇంకా కష్టం. కొన్ని తృణ ధాన్యాలను నేరుగా వండుకోవచ్చు కానీ ఎక్కువ రకాల ధాన్యాలకు పొరలు అధికంగా ఉంటాయంటున్నారు. ఆ పొరలన్నింటినీ తొలగించి వండడానికి ఎక్కువ సమయం పడుతుందని, ఇప్పుడు పొరలను తొలగించే యంత్రాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తక్కువ పొరలుండే తృణ ధాన్యాల ఉత్పత్తిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని, మిల్లెట్స్‌తో రెడీమెడ్ వంటకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయని ‘సబల’తో తాజాగా 45 రకాల రెడీమేడ్ వంటకాలు రావడం మరింత ఉపయోగంగా ఉంటుందని వారు వివరించారు.
చిరు ధాన్యాలతో ఆరోగ్య సిరి - వరదాయినిగా మారిన మిల్లెట్స్ - Millets Benefits In Daily Life