తెలంగాణ

telangana

ETV Bharat / state

హెడ్ కానిస్టేబుల్ యాదయ్య : ఆయన సాహసం అసామాన్యం - అందుకే అత్యున్నత గౌరవం - TG HEAD CONSTABLE PRESIDENT MEDAL - TG HEAD CONSTABLE PRESIDENT MEDAL

President Medal to Head Constable Yadaiah : విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి, ధైర్య సాహసాలను ప్రదర్శించి దొంగను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పతకం దక్కింది. దేశంలోనే ఈసారి ఈ పతకం అందుకున్న ఏకైక పోలీసు తెలంగాణకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్య కావడం విశేషం.

Head Constable Yadaiah gets President Medal for Gallantry
President Medal to Head Constable (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 10:11 AM IST

Updated : Aug 15, 2024, 10:18 AM IST

Head Constable Yadaiah gets President Medal for Gallantry :పోలీస్​ విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలకు తెగించి సమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ) ఆయన్ను వరించింది. పోలీసులకు లభించే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పతకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీస్‌ యాదయ్య కావడం విశేషం.

రెండు సంవత్సరాలు క్రితం గొలుసుదొంగను పట్టుకునే క్రమంలో ఏడుసార్లు కత్తిపోట్లకు గురైనా భయపడకుండా ప్రతిఘటించి పట్టుకున్నారు. దీంతో ధీశాలి యాదయ్యకు ఈ సమున్నత గౌరవం దక్కింది. రాష్ట్రానికి చెందిన మరో 28 మంది అధికారులు కూడా వివిధ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ వంటి ఆపరేషన్లలో పాల్గొనే సీఏపీఎఫ్‌ బలగాలు, వివిధ విభాగాల పోలీసులకు దక్కే రాష్ట్రపతి శౌర్య పతకం ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి పోలీసుకు లభించడం చాలా అరుదు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్‌ తన కార్యాలయంలో బుధవారం యాదయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు అదనపు డీజీపీలు సంజయ్‌కుమార్‌ జైన్, విజయ్‌కుమార్, ఐజీపీ రమేశ్‌ పాల్గొన్నారు.

ఆ సాహసం - అసామాన్యం! :2022 జులై 25న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్​లో కాత్యాయని(72) అనే మహిళ తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ ఇద్దరు దొంగలు బైక్​పై వచ్చి ఆమె గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె గొలుసును ఒడుపుగా పట్టుకోవడంతో కొంతమేర తెంచుకెళ్లారు. దీంతో ఈ ఘనటపై మాదాపూర్​లో కేసు నమోదైంది. కేసుపై దృష్టి సారించిన మాదాపూర్‌ సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ యాదయ్యతోపాటు కానిస్టేబుళ్లు రవి, దేబేశ్‌ బృందంగా ఏర్పడి సీసీ కెమెరాలను పరిశీలించారు. మళ్లీ మరుసటిరోజు మియాపూర్‌లోని బొల్లారం ఎక్స్‌రోడ్డు వద్ద గొలుసు దొంగల సంచారం గుర్తించి వెంటనే వేట మొదలుపెట్టారు.

ముగ్గురు పోలీసులూ రెండు ద్విచక్ర వాహనాలపై బయల్దేరారు. రవి వాహనం నడుపుతుండగా యాదయ్య వెనుక కూర్చున్నారు. బొల్లారం ఎక్స్‌రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న గొలుసు దొంగలను గుర్తించారు. దీంతో కానిస్టేబుళ్లు వారిని వెంబడించారు. దొంగలను అడ్డుకుని, అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నిందితుల్లో రాహుల్‌ (19) అనే వ్యక్తి వాహనం నడుపుతుండగా వెనుక ఇషాన్‌ నిరంజన్‌ నీలమ్‌నల్లి (21) కూర్చున్నాడు. తమను అడ్డుకుంది పోలీసులే అని తెలియగానే ఇషాన్‌ కత్తి తీశాడు.

ఏడుసార్లు పొడిచినా - రక్తం ధారగా కారుతున్నా : ఈ క్రమంలో దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన యాదయ్యను ఏడుసార్లు పొడిచాడు ఆ నిందితుడు. యాదయ్య పొట్ట, ఛాతి, వీపు, ఎడమచెయ్యి ప్రాంతాల్లో కత్తిపోట్లు తగిలాయి. అయినా రక్తం ధారగా కారుతున్నా యాదయ్య ఆ దొంగను వదల్లేదు. ఈలోపు మిగతా ఇద్దరు పోలీసులు రాహుల్​ను పట్టుకున్నారు. పట్టపగలు, నడిరోడ్డు మీద పోలీసులు, దొంగల మధ్య జరిగిన ఈ ఘర్షణ అప్పుడు కలకలం రేపింది. ఈలోగా సెట్‌లో సమాచారం అందగా సమీపంలో ఉన్న అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగలిద్దరినీ పట్టుకున్నారు. వెంటనే యాదయ్యను ఆసుపత్రికి తరలించారు. 17 రోజులపాటు తీవ్రగాయాతో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకున్నారు.

అనంతరం యాదయ్యకు మూడుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ క్రమంలో దొంగలను విచారించిన పోలీసులు నిందితలు ఇషాన్, రాహుల్‌లు ఎస్సార్‌నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో వారింట్లో తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ గొలుసుచోరీలతోపాటు ఆయుధాల విక్రయ దందాకు పాల్పడే ఘరానా దొంగలుగా తేలింది. విధినిర్వహణలో భాగంగా ప్రాణాలను లెక్కచేయకుండా ప్రతిఘటించిన యాదయ్యకు పురస్కారం కోసం రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా యాదయ్య హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సహకారంతోనే ఈ పురస్కారం దక్కిందని పేర్కొన్నారు.

ఒకే ఒక్కడు - తెలంగాణ హెడ్​ కానిస్టేబుల్​కు రాష్ట్రపతి శౌర్య పతకం - PRESIDENT GALLANTRY MEDAL 2024

Last Updated : Aug 15, 2024, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details