Harishrao Hot Comments : కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని మాజీమంత్రి హరీశ్‌రావు(Harishrao) పేర్కొన్నారు. దుబ్బాకలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, పార్టీ మారుతున్న నేతలపై ఘాటుగా స్పందించారు. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడిచిపోతున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఇదేం పార్టీకి కొత్తకాదని, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయినప్పటికీ కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపెట్టారన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని దుయ్యబట్టారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను, కార్యకర్తలను కొనలేరని స్పష్టం చేశారు.
మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్లు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని, పార్టీలోంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించినట్లు హరీశ్‌రావు వెల్లడించారు. ఇది ఆకులు రాలే కాలం, కొత్త చిగురు మళ్లీ పార్టీలో పుట్టుకువస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడానికి గేట్లు ఎత్తడం కాదు, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వంలో రైతులను రాజులను చేశారన్నారు. 100 రోజులు కాంగ్రెస్ పాలన విఫలమైందని, హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు.