Harish Rao Recites Hanuman Chalisa on Stage :రాముడు పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, బీజేపీ వాళ్లు మాట్లాడితే రామాలయం అంటారని, తాము మొక్కమా రామున్ని అంటూ స్టేజీ పైనే హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. రాముడు అందరివాడంటూ హనుమాన్ చాలీసా చదివి కార్యకర్తలను ఆకట్టుకున్నారు.
బీజేపీ నేతలకు వస్తదో రాదో అంటూ చురకలంటించిన ఆయన, తనను పఠించమంటే రెండు నిమిషాల్లోనే హనుమాన్ చాలీసా పఠిస్తానని హరీశ్‌రావు తెలిపారు. మతం పేరుతో రాజకీయాలు(Religion Politics) తప్ప రాష్ట్రానికి చేసిన ఒక్క మంచి పనేమిటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదన్న హరీశ్‌రావు, కమలం పార్టీ నేతల మాట వింటే జోడీ, లేదంటే ఈడీ అంటూ ఆక్షేపించారు. ఇది ఇవాళ ఈ దేశంలో రాజకీయ పరిస్థితని దుయ్యబట్టారు.
"పదేండ్ల బీజేపీ పాలనలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పమన్నా చెప్పలేరు. కమలం పార్టీ మాట వింటే జోడీ, వినకపోతే ఈడీ. ఇదీ ఇవాళ ఈ దేశం తాలుకా రాజకీయ పరిస్థితి. విదేశాల్లో నల్లధనం తెస్తామని, ఒక్కోక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. మరి పడ్డాయా మరీ? ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలిస్తామన్న మీ మేనిఫెస్టో ఏమైంది? పదేళ్లలో కనీసం కోటి ఉద్యోగాలు కూడా కల్పించకుండా నిరుద్యోగులకు మోసం చేసిన ఘనత మీది."-హరీశ్‌రావు, మాజీమంత్రి
Harish Rao Fires on BJP Govt : విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామని, ఒక్కోక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్న కమలం పెద్దల మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్ధానాలుతో గద్దెనెక్కిన బీజేపీ, ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవ్వాలి. కానీ దశాబ్ద కాలంలో ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు.