Harish Rao Tweet On Dog Attacks : కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. 'కుక్కలు పీక్కు తినడం', 'కుక్కకాటుకు మరణాలు' అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆందోళన చెందారు. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతున్నాయని ముందు నుంచీ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ ఏడాది రాష్ట్రంలో 60 వేలకు పైగా కుక్క కాట్లు నమోదయ్యాయని వెల్లడించారు. పదుల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయిన ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని వాపోయారు.
యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను అందించలేని దుస్థితి:నియంత్రణా చర్యలు పక్కన పెడితే, కనీసం యాంటీ రేబిస్ ఇంజెక్షన్లను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడంలోనూ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పడకేసిందని, చెత్తాచెదారం పేరుకుపోయి వీధికుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మున్సిపాలిటీలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేక మనుషుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని దుయ్యబట్టారు.