Gunadala Flyover Construction Work Not Completed Since 15 Years :విజయవాడ గుణదల పైవంతెనకు శంకుస్థాపన చేసి 15 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. దీంతో నున్న, నూజివీడు ప్రాంతాల నుంచి విజయవాడ నగరంలోకి నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంతెన పూర్తి చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో ఈ సమస్యపై మాట్లాడారు. ఈ ప్రాంతంలో బొండా ఉమ పర్యటించి త్వరలోనే పనులు చేపడతామని ప్రకటించడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
గుణదల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైల్వే గేటు దాటాలంటే నరకం చూస్తున్నారు. రైల్వే గేటు పడితే ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న బుడమేరు, రైవస్, ఏలూరు కాలువలు దాటుతూ ప్రమాదకరమైన ప్రయాణం సాగిస్తున్నారు. నున్న, నూజివీడు వంటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ఇదే దగ్గర దారి కావడంతో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే గేటు పడితే అరగంట వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2009లో అప్పటి ప్రభుత్వం 36 కోట్ల రూపాయలతో వంతెనకు శంకుస్థాపన చేసింది. నేటికీ వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుణదల రైల్వే పై వంతెన నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు