Kodali Nani Followers Remand : తెలుగుదేశం నేత, ప్రస్తుత రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆయన కార్యాలయంపై రెండేళ్ల కిందట పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులు, రాడ్లతో వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని అనుచరులు దాడి చేసి అరాచకం సృష్టించారు. ఈ కేసులో తాజాగా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మొదట పెదపారుపూడి, మధ్యాహ్నం నందివాడ స్టేషన్లకు తరలించారు.
ఈ నేపథ్యంలోనే వైద్య పరీక్షల అనంతరం నిందితులను బుధవారం రాత్రి గుడివాడలోని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడినుంచి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు కాళీ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
అసలేం జరిగిదంటే :డిసెంబర్ 26, 2022న తెలుగుదేశం నాయకులు గుడివాడలో పలుచోట్ల వంగవీటి రంగా వర్ధంతి నిర్వహణకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25న టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు కాళీ ఫోన్ చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో రంగా వర్ధంతి నిర్వహిస్తే సహించబోమని బెదిరించాడు. నిర్వహించి తీరతామని రావి చెప్పడంతో కాళీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది.
అనంతరం కాళీ తన ముఠాతో రావి వెంకటేశ్వరరావు కార్యాలయం వద్దకు పెట్రోల్ ప్యాకెట్లతో వచ్చి సుమారు రెండు గంటలపాటు అరాచకం సృష్టించారు. టీడీపీ నాయకులపై కత్తులు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కార్యాలయానికి నిప్పంటించబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆస్తుల ధ్వంసం, దొమ్మీ, దాడికి వర్తించే నామమాత్రపు సెక్షన్లతోనే కేసు పెట్టారు. మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్‌తో పాటు మరో 20 మంది నిందితులని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఘటన జరిగిన సమయంలోని వీడియోలను పరిశీలించి, హత్యాయత్నం సెక్షన్‌ను జోడించారు.
ఈ క్రమంలో కేసు పునర్విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు పది బృందాలను మోహరించారు. వారి సెల్‌ఫోన్లపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు కాళీ ఆచూకీ కోసం రెండు బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. అయితే కాళీ ఈశాన్య రాష్ట్రాల్లో చేపల వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి కొడాలి నాని ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. నాని పాత్రకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆయణ్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని తెలిసింది.
అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ - గుడివాడ గడ్డం గ్యాంగ్
దాడి కేసు - కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరెస్ట్