ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరు రోజులు బిజీ - వీకెండ్​లో 'ట్రెక్కింగ్‌ కింగ్స్‌' అడ్వెంచర్స్‌ - GUNTUR TREKKING KINGS

వారాంతాల్లో గుంటూరు యువత సాహసయాత్రలు - గుంటూరు ట్రెక్కింగ్‌ కింగ్స్‌ పేరుతో అడ్వెంచర్స్‌ - ట్రెక్కింగ్‌లో పాల్గొంటున్న 150 మంది సభ్యులు

Adventurous Tours on Guntur Trekking Kings
Adventurous Tours on Guntur Trekking Kings (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2025, 8:02 PM IST

Adventurous Tours on Guntur Trekking Kings : పర్వతాలను అధిరోహించడం అంత తేలికేం కాదు. ధైర్యసాహసాలతోపాటు చాకచక్యంగా వ్యవహరించాలి. అందుకోసం నెలలకొద్ది సాధన చేయాలి. అప్పుడే దట్టమైన అడవులు, నీటి ప్రవాహాలు దాటుకుంటూ ఎత్తయిన కొండ శిఖరాల్ని తాకడం సాధ్యం అవుతుంది. అందుకు తాము సిద్ధం అంటున్నారు గుంటూరు యువత. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పర్వతాలు ఎక్కుతున్న గుంటూర్‌ ట్రెక్కింగ్‌ కింగ్స్‌ బృందంపై ప్రత్యేక కథనం.

సాంకేతిక పోటీ ప్రపంచంలో సాహసాలకు దూరం అవుతున్నారు నేటితరం. విద్య, ఉద్యోగం, వ్యాపారం అంటూ ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అలవాట్లు, అభిరుచులు పక్కనపెడుతున్నారు. కానీ, మేమందుకు భిన్నం అంటున్నారీ యువత. తమ అభిరుచిని చాటుకునేందుకు వారాంతాల్లో కలిసి ట్రెక్కింగ్ చేస్తున్నారు. పచ్చని చెట్లు, పారుతున్న సెలయేర్లు దాటుకుంటూ పర్వతాలు అధిరోహిస్తున్నారు గుంటూరు ట్రెక్కింగ్‌ కింగ్స్ బృందం.

కష్టపడింది - కల నెరవేర్చుకుంది - గీతా భార్గవి విజయగాథ ఇది

గుంటూరు ట్రెక్కింగ్‌ కింగ్స్ బృందం 2022లో ఏర్పాటైంది. ప్రస్తుంత 150 మంది సభ్యులు యాక్టివ్‌గా ఉన్నారు. ఇందులో గుంటూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్ చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వారిలో పుల్లారావు, మోహన్ ట్రెక్కింగ్ ప్రదేశాలకు సంబంధించిన విషయాలు పర్యవేక్షిస్తారు. ఎక్కడికి వెళ్లాలని అనే అంశంపై సభ్యులందరితో చర్చించి శనివారం గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టా, ఫేస్‌బుక్ పేజీలో సమాచారం ఇస్తారు.

సమాచారం అందుకున్న సభ్యులందరూ ఆదివారం ఉదయమే ఎంపిక చేసుకున్న పర్యాటక ప్రదేశానికి వస్తారు. ఈ అడ్వెంచర్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు అనే తేడా లేకుండా సహచరులతో కలిసి సందడి చేస్తారు. ట్రెక్కింగ్‌తో పాటు అందుబాటులో ఉన్న సాహస క్రీడలు, విన్యాసాల్లో పాల్గొంటారు. అందులో భాగంగా గుంటూరులోని పేరేచర్ల నగరవనంలోని జిప్‌లైన్ విన్యాసం ఎంతగానో నచ్చిందని చెబుతున్నారు.

విలాసవంతమైన జీవితం వదులుకుని 'వే' చూపిస్తున్న యువకుడు

ఎత్తయిన కొండ మీద నుంచి 300 మీటర్ల దూరం సాగే ఈ జిప్‌లైన్‌ విన్యాసం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటు‌న్నారు. చల్లని గాలి, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాల మధ్య జిప్‌లైన్‌ విన్యాసం అత్యద్భుతంగా ఉందంటున్నారు. గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ బృందం ఇప్పటివరకూ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న ప్రముఖ కొండలన్నీ చుట్టేసింది. అహోబిలం, శేషాచల అడవుల్లో తుంబుర తీర్థం, కడపలోని గండికోట, పల్నాడు కోటప్పకొండ, ఫిరంగిపురం, కొండవీడు, పుట్టకోట కొండలపై ట్రెక్కింగ్ చేశారు. వీటితో పాటు ముక్తి కొండ, కొండపల్లి, మూలపాడు తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు.

ఒక్క రోజులో వెళ్లివచ్చేలా ప్రణాళిక చేసుకుంటూ యాత్రలు కొనసాగిస్తున్నారీ బృందం. ఎంత దూరమైన సొంత ఖర్చులతోనే వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పని ఒత్తిడిని తట్టుకోవాలంటే ప్రకృతిలో గడపాలని సూచిస్తున్నారు. ట్రెక్కింగ్‌ చేయడం వల్ల మానసిక, శారీరక సామర్థ్యం బలపడుతుందని చెబుతున్నారు.

"ఈ ట్రెక్కింగ్‌ ప్రతి వారం నిర్వహిస్తుంటారు. 100 నుంచి 150 మంది వరకు వస్తారు. ఇదంతా మౌంటనీరింగ్ కోర్సు చేసిన అతను నిర్వహిస్తుంటారు. వారంలో ఉన్న ఒత్తిడి మొత్తం ఇలా వీకెండ్​లో తీర్చుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగులు కుర్చీలకే పరిమితం కాకుండా పకృతి ఒడిలో గడిపితే మానసిక, శారీరక సామర్థ్యం బలపడుతుంది." - గుంటూర్‌ ట్రెక్కింగ్‌ కింగ్స్‌ బృందం

వారం రోజులు తీరిక లేకుండా గడిపే వీరంతా వారాంతాల్లో ట్రెక్కింగ్‌ పేరిట తప్పనిసరి కలుస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువమంది స్నేహితులతో పాటు సామర్థ్యం పెంచుకోవచ్చని చెబుతున్నారు.

శభాష్ - అభాగ్యులకు ఆత్మ బంధువు 'మన ఇల్లు'

వ్యవసాయమంటే దండగ కాదు - పండగ అని నిరూపిస్తున్న యువ రైతులు

ABOUT THE AUTHOR

...view details