GroundNut Farmers Protest for Price In Mahabubnagar :కష్టం అంతా వీరిదే అన్నట్లు తయారైంది రాష్ట్రంలో పల్లి రైతుల పరిస్థితి. ఎంతో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక వేరుశనగ రైతులు దిగాలుమంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, బాదేపల్లి సహా పలు మార్కెట్లలో పల్లి రైతులది ఇదే పరిస్థితి. దీనికి కారణం మార్కెట్లలో వ్యాపారులు చేస్తున్న మోసాలే. వ్యాపారులు పల్లి నాణ్యతను పరిశీలించడానికి నిబంధనలు పాటించకుండానే దాన్ని చేతితో తీసుకుని ధర నిర్ణయించడమే రైతుల ఆగ్రహానికి కారణం.
ఒకే రైతుకు చెందిన రెండు కుప్పలకు రెండు వేర్వేరు ధరలను నిర్ణయిస్తున్నారు. ఇలా పరిశీలించే క్రమంలో తోచిన ధరలు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కనీసం పెట్టుబడి కూడా దక్కక అన్నదాతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన బాట పట్టారు. గిట్టుబాటు ధరల కోసం రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అచ్చంపేటలో వేరుశెనగ రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ అరుణపైనే దాడికి దిగారు. ఆవరణలోని వేరుశెనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. కార్యాలయం ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పట్టణంలోని ప్రధాన రహదారిపై అంబేడ్కర్ కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. కల్వకుర్తిలో మార్కెట్ సిబ్బందిని నిలదీశారు. కోదాడ-రాయచూర్ రహదారిపై హైదరాబాద్ కూడలి వద్ద బైఠాయించి 4 గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. మహబూబ్‌నగర్‌లోనూ వ్యవసాయ మార్కెట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తెలంగాణ కూడలిలో ధర్నా చేపట్టారు. రాత్రి వరకూ ఆందోళన నిర్వహించారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర 6 వేల 377 రూపాయల కంటే అన్ని వ్యవసాయ మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నా గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Farmers Demand for Minimum Support Price :ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ వచ్చే మార్కెట్లన్నీ దాదాపుగా ఈ-నామ్ మార్కెట్లే. ఈ మార్కెట్లలో అమ్మే పంటను రాష్ట్రంలోని ఏ మార్కెట్ నుంచైనా, ఇతర రాష్ట్రాల నుంచైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు. ఎంతమంది వ్యాపారులు ఉంటే పోటీ అంత తీవ్రంగా ఉంటుంది. రైతుకు మంచి ధర దక్కుతుంది. కాని ఈ-నామ్ మార్కెట్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల స్థానిక వ్యాపారులే పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తున్నా స్థానిక కమిషన్ ఏజెంట్లు, వ్యాపారుల ద్వారానే కొంటున్నారు. దీంతో స్థానికంగా వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారుతోంది.
ఈ-నామ్ మార్కెట్లలో పంట నాణ్యతను నిర్ణయించడానికి గ్రేడింగ్ ల్యాబ్‌లు ఉంటాయి. అక్కడ వేరుశనగ నాణ్యతను నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తే దాన్ని బట్టి వ్యాపారులు ధరలు నిర్ణయించుకోవాలి. కాని దాదాపు అన్ని మార్కెట్లలో వేరుశనగ నాణ్యతను నిర్ధారించే పరికరాలు లేవు. దీంతో పంట నాణ్యతను కూడా వ్యాపారులే స్వయంగా చూసి, పల్లీని చేతితో నలిపి నూనె శాతాన్ని పరీక్షిస్తున్నారు. తాము అనుకున్న గ్రేడ్ ప్రకారమే ధరలను నిర్ణయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనేందుకు ముందుకు వచ్చినా స్థానిక వ్యాపారులు చెప్పిందే నాణ్యత. ఇలా నాణ్యత పేరుతో పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ మార్కెట్లకు జనవరి నుంచి వేరుశనగ రాక ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరిలో క్వింటా గరిష్ఠ ధర 8 వేల రూపాయలకు పైనే పలికింది. ఫిబ్రవరి మాసానికి వచ్చే సరికి గరిష్ఠ ధరలు 7 వేల లోపునకు పడిపోయాయి. సగటు ధర ఎంఎస్పీ(MSP) కంటే అధికంగా ఉన్నా కనిష్ఠ ధరలు 3 వేల నుంచి 4 వేల మధ్య ఉన్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటా వేరుశనగ గరిష్ఠ ధర 8 వేల 500 రూపాయలకు పైనే ఉంది. ఈ ఏడాది ధరలు తగ్గాయి. కనిష్ట, గరిష్ఠ ధరల మధ్య తేడా ఉండడం సహా, గత ఏడాదితో పోలిస్తే ధరలు తగ్గడంపైనే రైతులు ఆగ్రహానికి లోనవుతున్నారు. నాణ్యత పేరిట వ్యాపారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.