Demand Increases For Green Jobs in India :ప్రస్తుతం ఉన్న పలు రకాలైన ఉద్యోగాల్లో కొన్నింటి ద్వారా ఏదో ఒక రకంగా పర్యావరణానికి హాని జరిగే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఇటువంటి అవకాశాలు కచ్చితంగా లేకుండా పూర్తిగా పుడమికి మేలు చేసేలా దోహదపడుతూ సహజ వనరులను కాపాడే ఉద్యోగాలను గ్రీన్ జాబ్స్ అంటున్నారు. ప్రస్తుతం వీటిలో నిపుణులకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే పలు పరిశ్రమలు తక్కువ వాతావరణ మార్పులకు కారణమయ్యే విధానాలనే ఎంపిక చేసుకుంటున్నాయి. పని తీరు, ఉత్పత్తులను పర్యావరణ హితంగా ఉండేలా మార్చుకుంటున్నాయి. మళ్లీ ఉపయోగించుకునే వనరులను వాడటం, తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలు వచ్చేలా నూతన ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టే వారిని గ్రీన్ రంగంలోని కొలువులు ఆకర్షిస్తోంది. సహజ వనరుల వినియోగం తగ్గించి క్లీన్ ఎనర్జీని తయారు చేసే పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేసే పరిశ్రమలు.. ఇటువంటి వాటిలో ఉండే ఉద్యోగాలను గ్రీన్ కెరియర్లుగా అంటున్నారు. పర్యావరణ హితంగా ఉండే ఉద్యోగాల్లో అగ్రికల్చర్ స్పెషలిస్టులు, ఎన్విరాన్‌మెంట్ టెక్నీషియన్లు, గ్రీన్ కన్‌స్ట్రక్షన్ మేనేజర్స్, విండ్ టర్బైన్ - సోలార్ ప్యానెల్ టెక్నీషియన్లు, న్యూక్లియర్ ఇంజినీర్స్ ఇలా ఇంకా చాలా రకాలైన ఉద్యోగాలు ఉంటున్నాయి.
ప్రభుత్వ రంగంలోనూ..
ప్రస్తుతం దేశంలో నేషనల్ సోలార్ మిషన్, స్మార్ట్ సిటీ మిషన్ వంటి పలు పథకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇటువంటి వాటికి గ్రీన్ స్కిల్క్ ఉన్న నిపుణులు చాలా అవసరం అవుతున్నారు. దేశంలో గ్రీన్ జాబ్ సెక్టార్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది మిగతా ప్రపంచంతో భారత ఆర్థిక, పర్యావరణ ప్రణాళిక వ్యూహాల్లో ఒక భాగం. ప్రపంచం గ్లోబల్ సవాళ్లు ఎదుర్కొనేకొద్దీ, జీవవైవిధ్యం, సహజ వనరులు తగ్గిపోవడం వంటి జరిగేకొద్ది గ్రీన్ కెరియర్లు మరింత అవసరం పడుతుంది. ఇవి పర్యావరణం పట్ల సానుకూలంగా పనిచేస్తాయి. సస్టెయినబుల్ అగ్రికల్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్‌మెంట్, రిసోర్స్ కన్జర్వేషన్ పలు విధాలుగా పర్యావరణానికి మంచి చేస్తాయి. 2070 కల్లా సున్నా కర్బన ఉద్గారాల దిశగా భారతదేశం పయనిస్తోంది.
- 2030 నాటికి విద్యుత్తు వాహనాల రంగంలో మరిన్ని మార్పులు, అభివృద్ధి జరగాలి అన్నదే భారత్కు ఉన్న మరో లక్ష్యం. పర్యావరణ సుస్థిరతకు పాటుపడే గ్రీన్ గంగా మిషన్ కూడా ఇదే కోవకు చెందుతాయి. ప్రస్తుతం ఉన్న పర్యావరణ ఇబ్బందులన్నీ తప్పించేలా ఇవన్నీ ఉండబోతున్నాయి.
- అధికారిక లెక్కల ప్రకారం పరిశ్రమల్లో వస్తున్న ప్రతి మార్పు ఏటా కొత్త ఉద్యోగాల తయారీకి నాంది పలుకుతోంది. ఇండియాలో 2025 సంవత్సరం పూర్తయ్యే సరికి దాదాపు 30 లక్షలు గ్రీన్ ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇది జరిగితే పూర్తిగా భారత గ్రీన్ ఎకానమీ మార్పులకు లోనవుతుందని ఒక అంచనా.
ఇంటర్న్‌షిప్స్ సైతం..
సస్టెయినబిలిటీ పరిశ్రమ ప్రపంచాన్ని కొత్తగా ఆక్రమించుకుంటోంది. తాజాగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఐ) దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన లక్ష మంది విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మన దేశంలోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కొత్తగా గ్రీన్ జాబ్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే ఆ కొలువులకు తగ్గట్లు అనుభవం అవసరం. వీటిని విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇంటర్న్‌షిప్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసీటీఐ సేల్స్‌ఫోర్స్, గ్రీన్ స్కిల్స్ అకాడమీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్నరోజుల్లో ఈ కెరియర్లకు మరింత డిమాండ్ పెరుగుతుందనడానికి ఇదే ఓ ఉదాహరణ.