Govt Plans To Protect Ancient Buildings :గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంలా నిలుస్తున్నాయి పురాతన కట్టడాలు. వందల ఏళ్ల క్రితం సంస్థానాధీశుల చేతిలో వెలుగొందిన కట్టడాలు ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గత చరిత్రను సగర్వంగా చాటే ఈ నిర్మాణాలు స్థానికులకు ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి. కోటలు, ప్రహరీలు, బురుజులు, ఇతర నిర్మాణాలు సినిమాలు, ధారవాహికలు, షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరణకు ఉపయోగపడుతున్నాయి. వాటిని పరిరక్షించి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
రక్తచరిత్రకు సజీవ సాక్ష్యంగా :గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది బైరాన్‌పల్లి బురుజు. ఒకే గ్రామస్థులు బలిదానానికి ఈ బురుజే సాక్ష్యం. ఓ వైపు నిజాం నిరంకుశత్వాన్ని, మరోవైపు రజాకర్ల దాష్టీకాలను ఎదురొడ్డిన బైరాన్పల్లిపై పగబట్టి దాడి చేసి 119 మందికి దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన 1948 ఆగస్టు 28న జరిగింది. ఆనాడు ఈ దుర్ఘటన ఈ బురుజులోనే జరిగింది. అనాటి రక్తచరిత్రకు సజీవ సాక్ష్యంగా బురుజు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. సినిమా దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి వీర తెలంగాణ సినిమా చిత్రీకరణలో భాగంగా కొన్ని సన్నివేశాలు ఇక్కడ చేశారు.
సినిమా చిత్రీకరణకు :మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో దశాబ్దాల క్రితం నిర్మించిన బురుజు మూవీ షూటింగ్‌లకు ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామం నడిబొడ్డున ఉండటంతో ఇక్కడ పలు సినిమాలను చిత్రీకరించారు. గద్దలకొండ గణేశ్, నితిన్, సంపూర్ణేశ్‌బాబు నటించిన ఇతర సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. బురుజు లోపల ఇల్లు కూడా ఉండటం విశేషం.