Governor Quota MLC Seats Case in High Court :మంత్రిమండలి పంపిన సిఫార్సులన్నీ యథాతథంగా ఆమోదించడానికి గవర్నర్ ఏమీ రబ్బరు స్టాంపు కాదని, వారు పంపించిన నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైతే వెనక్కి పంపే అధికారం గవర్నర్‌కు ఉందని గవర్నర్ కార్యాలయం తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. గతంలో తమ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
గవర్నర్ కార్యాలయం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాన్ని వినియోగించుకునే హక్కు గవర్నర్‌కు ఉందని తెలిపారు. అనాలోచితంగా తిరస్కరించారన్న ఆరోపణ సరికాదని చెప్పారు. గవర్నర్ విధుల నిర్వహణకు సంబంధించి ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చి ఆదేశాలు ఇవ్వజాలరన్నారు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ నియామాకానికి సంబంధించి పేర్కొన్న అర్హతలు ఉన్నాయో లేవో గవర్నర్ పరిశీలించారని తెలిపారు. తగిన అర్హతలు లేకపోవడంతో మంత్రిమండలి సిఫార్సులను తిరస్కరించారని పేర్కొన్నారు. గవర్నర్ తిరస్కరణకు కారణాలను పేర్కొన్నందున వాటికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిమండలిపై ఉందన్నారు. ఇక్కడ పిటిషన్ వేయడానికి సరైన సమాచారం లేదని పేర్కొన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఉత్తర్వులు అడిగారని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అయితే న్యాయసమీక్ష చేయరాదా అంటూ ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది సమాధానమిస్తూ న్యాయసమీక్ష చేయవచ్చని, అయితే ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేయాలని కానీ గవర్నర్‌కు కాదని తెలిపారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
ఎమ్మెల్సీలుగా దొడ్డిదారిన పంపాలన్న మంత్రిమండలి ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారనగా, ధర్మాసనం స్పందిస్తూ రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహించాలని ప్రశ్నించింది. కొత్తగా నియమితులైన ఇద్దరు వ్యక్తుల నేపథ్యమేమిటన్న ప్రశ్నకు న్యాయవాది సమాధానమిస్తూ వారు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కాదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం గవర్నర్‌కు దురుద్దేశాలను ఆపాదించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో సభను ఉద్దేశించి ప్రసగించడానికి అవకాశం ఇవ్వలేదని, ఇది రాజ్యాగంలోని అధికరణ 176కు విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టును ఆశ్రయించిన తర్వాత దాని సూచనతో ఆహ్వానించిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలను కూడా గత ప్రభుత్వం నిర్వహించలేదని గుర్తు చేశారు.