Government on Hyderabad Fourth City : తెలంగాణలో కొత్తగా ఐటీ సంస్థలు, పరిశ్రమలను స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. నాలుగో నగరం చుట్టూ వీటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా పట్టా, ప్రభుత్వ భూముల వివరాలను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఔటర్‌కు సమీపంలోని కొన్ని, ఎయిర్ పోర్ట్ దగ్గరగా మరికొన్ని ప్రాంతాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు. 2 జిల్లాల్లో 6 మండలాల్లో కొన్ని గ్రామాలను సూత్రప్రాయంగా రెవెన్యూ అధికారులు ఎంపిక చేశారు. గతంలో పరిశ్రమలకు స్థలాలు ఇచ్చి కార్యకలాపాలు కొనసాగించకపోతే వాటిని వెనక్కితీసుకునేందుకు అవసరం అయిన విధివిధానాలను రూపొందించాలని నిర్ణయించారు.
పరిశ్రమలు-టెక్స్‌టైల్స్ :నాలుగో నగరానికి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశ్రమలు, టెక్స్‌టైల్ హబ్‌లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్‌కి సమీపంలో ఫాక్స్‌కాన్ సంస్థ ఆపిల్ ఫోన్ విడి భాగాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. షాబాద్ మండలంలో టెక్స్‌టైల్స్, విద్యుత్ బస్సుల తయారీ పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొత్తగా పరిశ్రమల హబ్, ఐటీలతో పాటు విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, వినోద కార్యకలాపాలను ప్రారంభిస్తే నాలుగైదు సంవత్సరాల్లో అక్కడ కూడా అభివృద్ధి వేగవంతం అమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటీ, పరిశ్రమల స్థాపనకు ముందే రోడ్లు నిర్మించడం, మొక్కలు నాటడం వంటివి చేపట్టనున్నామని అధికారులు తెలిపారు.