Aarogyasri talks fail: ఆరోగ్యశ్రీ సీఈవోతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపి స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. ఈరోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండో సారి జరిపిన చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో 203 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. కానీ నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ ను కొనసాగిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది.
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తమ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేయనున్నట్లు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయిపడిన రూ.1,500 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బకాయిలపై టీడీపీ నేత దేవినేని మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Devineni Uma press meet
గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై. రమేష్, ప్రధాన కార్యదర్శి సి. అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం తాత్కాలికంగా రూ. 203 కోట్లు విడుదల చేసింది. బుధవారం సాయంత్రం మరోమారు ఆరోగ్యశ్రీ సీఈవోతో నెట్‌వర్క్ ఆసుపత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెండింగ్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం రూ. 203 కోట్లు మాత్రమే విడుదల చేయడంతో ఆరోగ్యశ్రీ సేవల బంద్‌ను కొనసాగిస్తున్నట్టు ఆశా ప్రతినిధులు తెలిపారు.
అయితే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రం నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రస్తుతం రూ. 203 కోట్లు విడుదల చేశామని, పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది.
'ఆరోగ్యశ్రీ కొత్త పథకం కాదు- బటన్ నొక్కటంలో ఆలస్యం ఎందుకు?' - Busireddy Narender Reddy Interview